
వెంగళరావునగర్, జనవరి 26: పట్టుదల ఉండాలేకానీ సాధించలేనది ఏమీ లేదని నిరూపించింది. చిన్నప్పుడు తన కండ్ల ముందు పోలీసు అధికారిణి చూసి తాను కూడా పోలీసు కావాలని కలలు కన్నది. అవి సాకారం చేసేందుకు నిరంతరంగా శ్రమించింది. తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో విజయ బావుటా ఎగురేసి ఎస్ఐ పోస్టు సాధించింది సామాన్య రైతుబిడ్డ స్వప్నారెడ్డి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరినరోజే ఎస్ఐకి ఎంపిక కావడంతో ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి తాను కలలుగన్న ఖాకీ కొలువులో చేరింది. శిక్షణ పూర్తి చేసుకొని ప్రస్తుతం సంజీవరెడ్డినగర్ పీఎస్‌లో సెక్టార్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తోంది.. సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలం కన్సాన్పల్లికి చెందిన మాణిక్‌రెడ్డి,జ్యోతి దంపతులకు కుమారుడు సందీప్‌రెడ్డి, కుమార్తె స్వప్నారెడ్డి సంతానం.
పిల్లలిద్దర్నీ మాణిక్‌రెడ్డి బాగా చదివించారు. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండే స్వప్న బీటెక్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసేసింది. 2016లో ఎస్సై పోస్టుకు తీవ్రంగా శ్రమించింది. 6 మార్కుల తేడాతో ఉద్యోగం కోల్పోయినా పట్టుసడలకుండా 2020లో ఎస్ఐ పోస్టు కోసం ప్రిపైరై పరీక్షలు రాసింది. ఆ తర్వాత అటవీశాఖ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వచ్చింది. ఆ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా ఉద్యోగానికి ఎంపికైంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా విధుల్లోకి చేరిన తొలిరోజే ఎస్ఐ ఫలితాలు రావడంతో ఆ ఉద్యోగానికి స్వస్తిపలికి..పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరింది. శిక్షణ అనంతరం గతేడాది అక్టోబర్ 23న పాసింగ్ పెరేడ్లో పాల్గొంది. పంజాగుట్ట డివిజన్ ఎస్ఆర్నగర్ పోలీసుస్టేషన్లో మహిళా సెక్టార్ ఎస్ఐగా స్వప్న బాధ్యతలు స్వీకరించారు.
అన్నయ్య ప్రోత్సాహం
అకుంఠిత దీక్ష, సంకల్పబలం, పట్టుదల, ఆత్మవిశ్వాసానికి అన్న సందీప్‌రెడ్డి ప్రోత్సాహం మరువలేనిది అంటున్నారు ఎస్ఐ స్వప్నారెడ్డి. బయట ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. కోచింగ్ మెటీరియల్‌ను సిద్ధం చేసుకొని ఇంట్లోనే అన్నతో కలిసి చదువుకునేదాన్ని. ఇద్దరం కలిసి ఎస్ఐ పోటీ పరీక్షలు రాయగా, అన్న ఉత్తీర్ణత కాలేదు. నేను ఎస్ఐగా పాసైనట్టు. రిజల్ట్స్ చూసి అమ్మానాన్న,అన్నయ్య ఎంతో సంతోషించారు. ట్రైనింగ్ అనంతరం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్, ప్రొబేషనరీ తర్వాత, ఎస్ఆర్నగర్ పోలీసుస్టేషన్లో ఎస్ఐగా మొదటి పోస్టింగ్ లభించింది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు పర్యవేక్షణలో నేరపరిశోధన, బాధితుల పట్ల మెలగాల్సిన విధానం వంటి అంశాలను తెలుసుకోగలిగానని స్వప్నారెడ్డి అన్నారు.
బాల్యంలోనే అంకురార్పణ
తాను చదువుకునే పాఠశాలలో నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన పోటీల విజేతల బహుమతుల ప్రదానానికి ఓ పోలీసు అధికారిణి వచ్చారు. ఆమె ధరించిన ఖాకీ యూనిఫామ్‌కు ఆకర్షితులైంది స్వప్న. ఆ పోలీసు అధికారిణి ప్రసంగానికి ముగ్దురాలై.. తాను కూడా పోలీసు కావాలని కలలుకనేది. అక్షరాలపై మమకారం పెంచుకొని కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి ఆదర్శంగా నిలిచింది.

ఎంతో కొంత మేలు చేయాలనే!!
ఖాకీ యూనిఫామ్ అంటే చిన్ననాటి నుంచి ప్రాణం. పోలీసు వృత్తిపై ఆకాంక్షతోనే ఈ ఉద్యోగంలోకి వచ్చాను. సమాజానికి ఎంతోమేలు చేయగలమనే సంకల్పంతోనే పోలీసుశాఖలోకి వచ్చాను. నేరాలు జరగకుండా కట్టడి చేయడంతోపాటు నేరం చేసిన వ్యక్తికి శిక్షపడేలా చేయడానికి ఈ వృత్తిలో ఆస్కారముంటుంది. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తూ నేరరహిత సమాజ స్థాపనకు కృషి చేస్తా.