ఊట్కూర్ (కృష్ణ) : నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ముడుమాల్( Mudmal ) గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ ( Short Circuit ) కారణంగా గుడిసె దగ్ధమై భారీ ఆస్తి నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన బోయ హనుమంతు నివాసముంటున్న గుడిసెలో రాత్రి 11.40 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.
మంటలు వేగంగా వ్యాపించడంతో హనుమంతు ఇంట్లోనే చిక్కుకుపోగా, ఆయన భార్య బయటకు తీసుకురావడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో గ్రామస్థులు అప్రమత్తమై వెంటనే అక్కడికి చేరుకుని హనుమంతును సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ప్రాణాపాయం నుంచి కాపాడారు.
మంటల్లో చిక్కుకున్న హనుమంతుకు చేతులకు గాయాలు కావడంతో 108 అంబులెన్స్ ద్వారా మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.4.70 లక్షల విలువైన నగదు, బంగారు, వెండి ఆభరణాలు, యూరియా బస్తాలు, ధాన్యం, గృహోపకరణాలు, విద్యుత్ సామగ్రి, మోటార్ సర్వీస్ వైర్లు, గుడిసె నిర్మాణ సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.
అలాగే పొలం పాస్‌బుక్కులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, విద్యా సర్టిఫికెట్లు, ఇతర ముఖ్యమైన పత్రాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో బాధిత కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.