మేడ్చల్ కలెక్టరేట్, డిసెంబర్ 17 : గతంలో జీపీ లే అవుట్ చేసిన భూమిలోనే తిరిగి అక్రమంగా లే అవుట్ చేస్తే రద్దు చేస్తామని హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కీసర గ్రామ పంచాయతీ పరిధిలోని కీసరదాయర సర్వే నంబర్ 184, 185, 186, 196లో 1983 సంవత్సరంలో 22 ఎకరాల్లో లేఅవుట్ చేశారు. అందులో పలువురు ప్లాట్లను కొనుగోలు చేశారు. అయితే కొందరు కబ్జాదారులు ఆ ప్లాట్లను కబ్జాచేసి హెచ్ఎండీఏ పేరుతో రీ-లేఅవుట్ చేస్తుండటంతో ప్లాట్ల యజమానులు కోర్టును ఆశ్రయించడంతో పాటు హెచ్ఎండీఏ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన హెచ్ఎండీఏ అధికారులు శుక్రవారం పై సర్వే నంబర్లలోని భూమిని పరిశీలించారు. ప్లాట్ల యజమానులతో మాట్లాడి వివరాలు సేకరించిన అధికారులు.. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. ప్లాట్ల యజమానులకు న్యాయం చేస్తామని, హెచ్ఎండీఏ నుంచి పొందిన తాత్కాలిక అనుమతులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్లాట్ల యజమానులు గాంధీనగర్ పేరుతో మరోమారు హెచ్ఎండీఏలో ఫిర్యాదు చేయాలని సూచించారు. గాంధీనగర్ ప్లాట్ల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.