హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ స్థలంలో లైంగిక వేధింపులపై వచ్చిన ఫిర్యాదును సరైన విచారణ లేకుండా మూసివేసినట్టు వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)ను ఆదేశించింది. ఎన్సీడబ్ల్యూతోపాటు హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆసి), ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ నిమ్మగడ్డ రమేశ్‌కు నోటీసులు జారీచేసింది.
వివరాల్లోకి వెళ్తే.. తనపై లైంగిక వేధింపులకు సంబంధించి సమర్పించిన ఫిర్యాదును ఎన్సీడబ్ల్యూ తగిన విచారణ జరుపకుండానే మూసివేసిందని ఆసిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ (58) హైకోర్టును ఆశ్రయించారు. ఆమెపై ఆసి డీజీ నిమ్మగడ్డ రమేశ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలి తరఫు లాయర్ వాదించారు. ఈ వ్యవహారంపై ఆమె తొలుత ఆస్కిలోని అంతర్గత లైంగిక వేధింపుల నివారణ కమిటీకి, ఆ తర్వాత ఎన్సీడబ్ల్యూకి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆస్కి అంతర్గత కమిటీ నివేదికను యథాతథంగా అంగీకరించి ఈ నెల 3న కేసును మూసివేసిందని, బాధితురాలికి వాదనలు వినిపించే అవకాశం కల్పించకపోవడం న్యాయసూత్రాలకు విరుద్ధమని వివరించారు.
ఎన్సీడబ్ల్యూ చట్టం-1990 సెక్షన్ 10 వినియోగానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఎన్సీడబ్ల్యూ ఉత్తర్వులను రద్దు చేయాలని, ఆస్కిలో అంతర్గత కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా బాధితురాలి ఫిర్యాదుపై కొత్తగా విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ ఆరోపణలపై కౌంటర్లు దాఖలు చేయాలని జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేశారు.