Online Game | పాట్నా: ఆన్లైన్ గేమ్స్ మోజు ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. ఓ బ్యాటిల్ గేమ్‌ను ఆడనివ్వలేదని ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యుల మీద కోపంతో ఓ తాళం, తాళాల గుత్తి, ఓ కత్తి, రెండు నెయిల్ కట్టర్లను మింగేశాడు. కొన్ని గంటల తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవడంతో కుటుంబ సభ్యులు ఆయనను దవాఖానకు తరలించారు. గంటన్నరసేపు శస్త్ర చికిత్స చేసి, ఆయన మింగినవాటన్నిటినీ వైద్యులు బయటకు తీశారు. ఇప్పుడు ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని డాక్టర్ అమిత్ కుమార్ చెప్పారు. బీహార్‌లోని మోతీహారిలో ఈ సంఘటన జరిగింది.
బడికి తుపాకీ తెచ్చిన ఆరో తరగతి విద్యార్థి
న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం ఆరో తరగతి విద్యార్థి బ్యాగులో తుపాకీని చూసి పాఠశాల సిబ్బంది అవాక్కయ్యారు. వెంటనే నజఫ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. విద్యార్థి వద్ద ఉన్న తుపాకీలో మ్యాగజైన్ లేదు. దీంతో అతని తల్లిని ప్రశ్నించారు. ఆ తుపాకీ తన భర్తదని, ఆయన కొద్ది నెలల క్రితం మరణించారని, తుపాకీని పోలీస్ స్టేషన్‌కు అప్పగించేందుకు దానిని బయట పెట్టానని చెప్పారు. బాలుడిని ప్రశ్నించినపుడు అది ఆట బొమ్మ అనుకుని, బడికి తీసుకొచ్చానని చెప్పాడు. తుపాకీ లైసెన్స్ సరైనదేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. తుపాకీని పోలీసు స్టోర్‌హౌస్‌కు అప్పగించారు.