ముంబై, జూలై 20: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.16,474 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.12,370 కోట్ల లాభంతో పోలిస్తే 33 శాతం ఎగబాకగా, జనవరి-మార్చి త్రైమాసికంలో వచ్చిన లాభంతో పోలిస్తే మాత్రం 6.5 శాతం తగ్గింది. బ్యాంక్ ఆదాయం మాత్రం రూ.57,816 కోట్ల నుంచి రూ.83,701 కోట్లకు ఎగబాకింది.
నికర వడ్డీ ఆదాయం 2.6 శాతం ఎగబాకి రూ.29,840 కోట్లకు చేరుకున్నది. వడ్డీయేతర ఆదాయం మాత్రం 41.3 శాతం తగ్గి రూ.10,670 కోట్లకు పరిమితమైంది.
మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.2,602 కోట్ల నిధులను వెచ్చించింది. క్రితం ఏడాది కేటాయించిన రూ.13,511 కోట్ల కంటే ఇది తక్కువ.
బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.24 శాతం నుంచి 1.33 శాతానికి పెరిగాయి.
కొత్తగా శాఖలను ప్రారంభించడంతో మొత్తం శాఖల సంఖ్య 8,800లకు చేరుకున్నాయి.
గత త్రైమాసికంలో కొత్తగా రూ.7,900 కోట్ల రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరాయి.
పన్నుల కోసం ఒకేసారి రూ.5,107 కోట్ల నిధులు వెచ్చించడంతో ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపింది.
తాకట్టుకింద పెట్టిన ఆస్తులను విక్రయించడంతో రూ.5 వేల కోట్ల నిధులు
సమకూరాయి.
అంచనాలుమించిన యూనియన్ బ్యాంక్
ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,679 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2023-24 ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభంతో పోలిస్తే 13.7 శాతం వృద్ధిని కనబరిచింది. వడ్డీల మీద వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 6.5 శాతం పెరిగి రూ.9,412 కోట్లు సమకూరడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం 15.53 శాతం ఎగబాకి రూ.4,509 కోట్లకు చేరుకున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో ఏ మణిమేఖలై తెలిపారు. కొత్తగా రూ.2,318 కోట్ల రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరాయి. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 4.54 శాతంగా నమోదైంది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.4,106 కోట్ల నిధులను వెచ్చించింది. ప్రభుత్వరంగ సంస్థలతోపాటు ప్రైవేట్ రంగ కంపెనీల నుంచి రుణాలకు డిమాండ్ అధికంగా ఉన్నదన్నారు. గత త్రైమాసికంలో కార్పొరేట్ రుణాలు 7 శాతం అధికమవగా, విద్యా, పసిడి రుణాలు 40 శాతం చొప్పున పెరిగాయి.