Harshil kalia | రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువ నటి, మోడల్ హర్షిల్ కాలియా (30) ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన షిప్రా పాత్ రోడ్డులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, హర్షిల్ కాలియా తన పనులు ముగించుకుని రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. వాటిలో కారు వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టి ఎడమ వైపుకు పల్టీలు కొడుతూ బోల్తా పడిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోలు ప్రమాద తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి కారునుండి హర్షిల్ను బయటకు తీశారు. తీవ్రమైన తల గాయాలతో ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునే సరికి పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై విచారణ కొనసాగుతోంది.
అతివేగం కారణమా? లేక మరే వాహనం ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించడంతో నియంత్రణ కోల్పోయిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
హర్షిల్ కాలియా ‘క్రైమ్ నెక్స్ట్ డోర్’ అనే వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు పొందారు. అదనంగా ఒక న్యూస్ ఛానల్లో యాంకర్‌గా కూడా పనిచేశారు. పలు రాజస్థానీ పాటల్లో ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవల మోడలింగ్ రంగంలో మరింతగా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె తండ్రి కూడా జర్నలిజం రంగంలో పనిచేస్తుండడం విశేషం. హర్షిల్ కాలియా అకాల మరణం రాజస్థానీ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. యువ ప్రతిభను కోల్పోవడంతో సినీ, మీడియా వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.