హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణ రంగంలో పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ విశేషంగా కృషి చేస్తున్నది. రాష్ట్రంలో భారీగా హరిత భవనాలను నిర్మిస్తున్నది. ఇప్పటికే 475 ప్రాజెక్టులకు భారత పరిశ్రమల సమాఖ్య అనుబంధ సంస్థ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ)లో నమోదు చేసింది కూడా. పర్యావరణాన్ని రక్షించేందుకు పలు ప్రభుత్వ భవనాలను గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌లో నిర్మించటమే కాకుండా అనేక వాణిజ్య, ఐటీ భవనాలను ఈ విధానంలో నిర్మించేలా ప్రోత్సహిస్తున్నది.
ఈ విధానాన్ని మరింత వ్యాపి చేసే ఉద్దేశంతో ఐజీబీసీ ఆధ్వర్యంలో గురువారం నుంచి 20వ తేదీ వరకు 19వ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్-21 సదస్సును నిర్వహిస్తున్నారు. వర్చువల్‌గా జరిగే సదస్సులో ‘నెట్ జీరో-బిల్డింగ్స్ అండ్ బిల్ట్ ఎన్విరాన్మెంట్’ అంశంపై పరిశ్రమలు, పర్యావరణ రంగాలకు చెందిన 80 మంది నిపుణులు పాల్గొని కాలుష్య నివారణకు పరిశ్రమలు చేపట్టాల్సిన విధానాలపై ప్రసంగించనున్నారు. సదస్సు సందర్భంగా గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీలు, గ్రీన్ ఉత్పత్తులు, దానికి సంబంధించిన సేవలపై 30 రోజుల ఆన్లైన్ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేయనున్నారు.
వాణిజ్య భవనాలు, ఐటీ పరిశ్రమల్లో విద్యుత్తు వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గిస్తూ సహజసిద్ధంగా గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణాలు చేపట్టాలనేది గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే పర్యావరణాన్ని కాపాడేందుకు గ్రీన్ బిల్డింగ్ విధానాల అమలుకు తెలంగాణ విశేష కృషి చేస్తున్నది. రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు 475 ప్రాజెక్టులను ఐజీబీసీలో నమోదు చేయించింది.
నమోదైన ప్రాజెక్టుల్లో 93 ప్రాజెక్టులను ఇప్పటికే ఐజీబీసీ ధ్రువీకరించింది. ఒక్క హైదరాబాద్‌లోనే 405 భవనాలు గ్రీన్ బిల్డింగ్ విధానానికి నమోదు కావటం విశేషం. పర్యావరణానికి నష్టం చేకూర్చకుండా సహజసిద్ధంగా గాలి, వెలుతురు, నీటి పొదుపు పాటిస్తున్నట్టు, ఇందుకోసం భవన నిర్మాణ సామగ్రి తయారీదారులు, సరఫరాదారులు, భాగస్వాములతో కలిసి తెలంగాణ ప్రభుత్వం, ఐజీబీసీ పనిచేస్తున్నట్టు సీఐఐ-సోహ్రాబ్జీ గ్రీన్ బిజినెస్ సెంటర్ ప్రిన్సిపల్ కౌన్సెలర్ ఎం ఆనంద్ తెలిపారు.
హుడా భవనం, ఆబిడ్స్ పరిశ్రమల శాఖ కమిషనర్ భవనం, హైదరాబాద్ భవన్, మెట్రో స్టేషన్లు, సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు, రైల్ నిలయం భవనం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తదితరవాటిని ఈ విధానంలో నిర్మించారు. కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారక భవనం, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ప్రధాన కార్యాలయం, సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర భవనాలను కూడా ఈ విధానంలోనే నిర్మిస్తున్నారు. డెల్, వేవ్‌రాక్, కె రహేజా ఐటీ పార్క్, మైండ్‌స్పేస్, ఇనార్బిట్ మాల్, జయభేరీ-ది పీక్, మై హోమ్ అవతార్, అపర్ణా సరోవర్, సైబర్‌సిటీ-రెయిన్బో విస్టాస్ తదితర ప్రైవేటు వాణిజ్య సముదాయాలు, భవనాలను ఈ విధానంలోనే నిర్మించారు.