హైదరాబాద్ : ప్రస్తుతం గోదావరి నదిలో ఎల్లంపల్లి వద్ద వరద ప్రవాహం ( Flood Water ) భారీగా కొనసాగుతున్నందున మోటార్లు నడిపి రిజర్వాయర్లను నింపాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ( Minister Uttam) కి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ( Harish Rao Letter ) సూచించారు. ఈ మేరకు శుక్రవారం లేఖను రాశారు.
ఇప్పటికైనా కళ్లు తెరచి , చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదని పేర్కొన్నారు. ఎల్‌నినోను సాకుగా చూపకుండా, అందివచ్చిన గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకునేలా ఆన్-ఆఫ్ పద్ధతిలో కాకుండా 24 గంటల పాటు అన్ని మోటార్లు నడిపి జలాశయాలను నింపాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాల ( Godavari Water ) ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవస్థను నిర్మించి, 141 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లను ఏర్పాటు చేశారని వెల్లడించారు.
✳️ వెంటనే మోటార్లు నడిపి జలాశయాలను నింపాలి
✳️ గోదావరిలో వరద పోతుంటే.. బురద రాజకీయాలేనా
✳️ ఎల్‌నినోను కారణంగా చూపి బాధ్యత నుంచి తప్పించుకోవద్దు
✳️ నీళ్లు లేక సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నడవని పరిస్థితి
✳️ ఎండిన రిజర్వాయర్లకు కాంగ్రెస్ పాలన నిర్లక్ష్యమే కారణం
✳️… pic.twitter.com/wiEMfKcaSO
— BRS Party (@BRSparty) September 25, 2026
రాజకీయాలు చేస్తూ పంటలు ఎండగొడుతున్నారు
గోదావరిలో వరద వచ్చినప్పుడు ఆ నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లను నింపితే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంద న్నారు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు గోదావరిలో భారీ వరద ప్రవాహం ఉన్నా, ఆ నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. నీళ్లు అందక పంటలు ఎండిపోతుంటే, మీరు మాత్రం ప్రాజెక్టుల మీద రాజకీయాలు చేస్తూ పంటలు ఎండగొడుతున్నారని విమర్శించారు. గోదావరి జలాలను లిఫ్ట్ చేయకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.
ఒకవైపు గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతుంటే, మరోవైపు అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీలో ఉన్నాయని, మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 13 టీఎంసీలు మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇక్కడ 50 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం అందుబాటులో ఉందన్నారు. మల్లన్న సాగర్ నిండుకుండలా మారితే హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటు, మూసీ ప్రాజెక్టుకు కూడా ఇక్కడి నుంచి నీటిని తరలించే అవకాశం ఉంటుందని సూచించారు.
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోనూ 15 టీఎంసీలకు కేవలం 6 టీఎంసీలే ఉన్నాయని, ఇక్కడికి సైతం నీటిని ఎత్తిపోస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.
ఎల్లంపల్లిలో నీటి ఎత్తిపోతలు ప్రారంభిస్తే మిడ్ మానేరు సహా అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లకు నీటిని తరలించడంతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా పూర్తి పరిష్కారం లభిస్తుందని సూచించారు. ఈ రిజర్వాయర్లను నింపడం వల్ల దాదాపు 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణానికి దోహదం చేసినట్లవుతుందని తెలిపారు.
మరోవైపు మిడ్ మానేరు దిగువన ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్.ఎం.డి.)లో ప్రస్తుతం 11 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని, ఇక్కడికి నీటిని తరలిస్తే కరీంనగర్, వరంగల్ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయని వివరించారు. పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాల్లోని రైతులు, ప్రజలకు ఎంతో మేలు చేసిన వారవుతారని తెలిపారు.
పాం ఆయిల్ ఫ్యాక్టరీకి నీళ్లు లేక ఇబ్బందులు
సిద్దిపేట జిల్లా నర్మెట్టలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని లేఖలో పేర్కొన్నారు. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్వహణ కోసం రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని , రంగనాయక సాగర్‌లో నీళ్లు లేకపోవడం వల్ల పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్వహణ ఇబ్బందిగా మారిందని వెల్లడించారు.
గోదావరి నదిలో ఎల్లంపల్లి వద్ద వరద ప్రవాహం భారీగా కొనసాగుతున్నది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని అన్ని మోటార్లను నడిపి నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్దేశపూర్వకంగా మీరు చేస్తున్న నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
జలకళతో కనిపించాల్సిన రిజర్వాయర్లు ఎండిపోయి కనిపిస్తున్నాయంటే దానికి కారణం నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. రాజకీయాలను పక్కన పెట్టి రైతు ప్రయోజనాల కోసం ఆలోచించాలని, ప్రకృతిపై నెపం నెట్టి రైతులకు సాగు నీళ్లు ఇచ్చే బాధ్యత నుంచి తప్పించుకోవద్దని కోరారు.