హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): తండ్రిది రోజువారీ బతుకుపోరాటం.. తల్లిది ఇల్లిల్లూ తిరిగి పాచిపనులు చేసే పని.. ఉండేది మురికివాడ.. అయితేనేం, తల్లిదండ్రులు తలెత్తుకొనేలా చేసిందో పేదింటి బిడ్డ. తెలంగాణ సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదివి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో సీటు సంపాదించింది. గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీలో చదివిన వంగూరి సహజ.. బాంబే ఐఐటీ లో సివిల్ ఇంజినీరింగ్‌లో సీటు దక్కించుకొన్నది.
తల్లిదండ్రుల కాయకష్టం, ‘సహజ’ంగా అబ్బిన టాలెంట్‌తో గురుకులం నుంచి ఐఐటీకి చేరింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభికి చెందిన వంగూరి ప్రగతి, గోపాలరావు దంపతులు.. బతుకుదెరువు కోసం 15 ఏండ్ల కింద హైదరాబాద్ కూకట్ పల్లికి వచ్చి కిరాయి ఇంట్లో ఉంటున్నారు. వీరికి కుమారుడు విక్రమ్, కూతురు సహజ ఉన్నారు.
తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన సహజ.. పట్టుదలతో చదివింది. ఐదో తరగతి ఇస్నాపూర్‌లో, 6, 7 మహేంద్రహిల్స్ గురుకులం, 8 నుంచి 10 వర కు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గురుకులంలో, గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ చదివింది. అధ్యాపకుల ప్రోత్సాహం, గైడెన్స్‌తో ఐఐటీ సీటు సంపాదించింది. గొప్ప విద్యాసంస్థలో సీటు దక్కించుకోవడంపై తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. తమ శ్రమకు తగిన ఫలితం దక్కిందని సంతోషిస్తున్నారు. సహజ అన్న విక్ర మ్ బీకాం చదువుతున్నాడు. తండ్రి గోపాలరావు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కొంతకాలం వివిధ పత్రికల్లో రిపోర్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ప్రైవేటుగా పనులు చేస్తున్నారు.
జీవితమంటే ఏంటో గురుకుల పాఠశాల నేర్పింది. అక్కడ ఉదయం 6 నుంచి రాత్రి 10:30 గంటలవరకు క్రమశిక్షణతో కూడిన టైం టేబుల్ ఉంటుంది. అదే గురుకులాల విద్య అంటే. నా గెలుపులో గురుకులాల కార్యదర్శి సహా కాలేజీ ప్రిన్సిపాల్ శారద, అధ్యాపకులు అందించిన ప్రోత్సాహాన్ని మరువలేను. నా తల్లిదండ్రుల కష్టమే నాకు స్ఫూర్తి. భవిష్యత్తులో ఐఏఎస్ సాధిస్తా. సహజ