లండన్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ప్రతిష్ఠాత్మక ‘లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్ -2026’ సదస్సులో భారతీయ పర్యావరణ ఉద్యమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు సంతోష్‌కుమార్ నేతృత్వంలో సాగుతున్న ఈ బృహత్తర ఉద్యమంపై లండన్ నగరంలోని బరో ఆఫ్ రెడ్‌బ్రిడ్జ్ టౌన్హాల్లో జరిగిన సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజల భాగస్వామ్యంతో వాతావరణ మార్పులను ఎలా సమర్థంగా ఎదురోవచ్చో తెలంగాణ నమూనా ప్రపంచానికి ఆచరణాత్మకంగా చాటిచెప్తున్నదని కొనియాడారు.
‘మనసులను రగిలిస్తే, సమాజం మారుతుంది’ అనే బలమైన నినాదంతో సంతోష్‌కుమార్ ఈ సదస్సులో కీలక ప్రసంగం చేశారు. భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం స్ఫూర్తితో తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో మొదలైన ఈ ఉద్యమం.. నేడు అంతర్జాతీయ స్థాయికి ఎలా చేరిందో వివరించారు. ఇప్పటివరకు 4 కోట్ల 40 లక్షల మంది పౌరుల భాగస్వామ్యంతో ఏకంగా 19 కోట్ల 60 లక్షల మొకలను నాటడమే కాకుండా, శాటిలైట్ మానిటరింగ్, జియో-ట్యాగింగ్ సాంకేతికత ద్వారా ప్రతి మొకనూ అత్యంత పారదర్శకంగా సంరక్షిస్తున్నామని తెలిపారు. మొకలు నాటడమే కాకుండా భారీ స్థాయిలో నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, పర్యావరణ పరిరక్షణ కోసం యువతను మార్పు నిర్దేశకులుగా ఎలా తీర్చిదిద్దుతున్నారో వివరించారు. ప్రభుత్వాలు, సంస్థలు, ప్రజలు అందరూ కలిసికట్టుగా అడుగులేస్తేనే శాశ్వత మార్పు సాధ్యమవుతుందని స్పష్టంచేశారు.
సంతోష్‌కుమార్ కృషికి సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ దిగ్గజాలు పూర్తి మద్దతు ప్రకటించారు. కామన్వెల్త్ సచివాలయ సీనియర్ డైరెక్టర్ సురేశ్‌యాదవ్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులను ఎదురోవడంలో ప్రజలు నడిపించే ఇలాంటి ఉద్యమాలు ప్రపంచ భాగస్వామ్యానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇల్ఫోర్డ్ సౌత్ పార్లమెంట్ సభ్యుడు జస్ అత్వాల్, మారిషస్ దేశ రాయబారి డాక్టర్ రాజేశ్ జీతా కూడా స్థానిక, జాతీయ స్థాయిల్లో ప్రజా విధానాలు, ప్రజల భాగస్వామ్యం కలిసి పనిచేస్తేనే నిజమైన ఫలితాలు వస్తాయని, ద్వీప దేశాలకు ఈ నమూనా ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
రెడ్‌బ్రిడ్జ్ నగర మేయర్ కౌన్సిలర్ బెర్ట్ జోన్స్ సదస్సుకు స్వాగతం పలుకుతూ.. తమ ప్రాంత ప్రజలకు కూడా ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఒక అద్భుతమైన మార్గదర్శకమని కొనియాడారు. స్థానిక ప్రభుత్వాలు, ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో ఈ కార్యక్రమం నిరూపించిందని వైస్ చైర్మన్ వనీషా సోలంకి, కౌన్సిలర్ జో బ్లాక్‌మన్, ఐసీఎస్ఆర్ అధిపతి డాక్టర్ ఓర్నిచా డౌరుయెంగ్, ట్రీహౌస్ నర్సరీ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాజియా తదితరులు ప్రశంసించారు.
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆలోచనల స్ఫూర్తితో హైదరాబాద్‌లో ఏర్పాటైన లాభాపేక్ష లేని ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ.. ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ పేరుతో పర్యావరణ పరిరక్షణ, నీటి భద్రత, యువత సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్నది. గ్రీన్ ఇండియా చాలెంజ్, వాటర్ ఫర్ వాక్ ద్వారా 33 దేశాల్లో విస్తరించిన ఈ సంస్థ.. 19.6 కోట్లకుపైగా మొకలు నాటి, 21 వేలకుపైగా నీటి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీరి సేవలకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సులో సంతోష్‌కుమార్‌కు ప్రత్యేక పరిశీలకుడి హోదా కూడా దక్కడం విశేషం