Ilayaraja | అగ్రనటుడు అజిత్ కుమార్ నటించిన సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) తాజాగా నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించబడింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కోర్టులో వేసిన కాపీరైట్ కేసు నేపథ్యంలో, మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అజిత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించాడు. ఏప్రిల్ 2025న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం మే 8, 2025 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అయితే సినిమాలోని కొన్ని పాటలు తన అనుమతి లేకుండా వాడినట్టు ఇళయరాజా కోర్టులో ఆరోపించారు.
పలు సినిమాలకు స్వరాలు అందించిన ఇళయరాజా తన సంగీతాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం అనుమతి లేకుండా వినియోగించడాన్ని కాపీరైట్ చట్టానికి విరుద్ధంగా పేర్కొన్నారు.అంతేకాకుండా, పాటలను తొలగించడంతో పాటు తగిన పరిహారం చెల్లించాలంటూ న్యాయపరంగా డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని విచారించిన మద్రాసు హైకోర్టు, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంలోని సంబంధిత పాటలను ప్రదర్శించరాదని, తాత్కాలికంగా స్ట్రీమింగ్ నిలిపివేయాలని ఆదేశించింది.దీంతో నెట్ఫ్లిక్స్ తక్షణమే స్పందించి సినిమాను తన ప్లాట్ఫామ్ నుంచి తొలగించింది. దీనిపై అధికారిక ప్రకటనలో “కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ చర్య తీసుకున్నాం” అని స్పష్టం చేసింది.
ఈ వివాదంపై స్పందించిన చిత్ర నిర్మాత రవి..చిత్రం విడుదలకు ముందు అన్ని పాటలకు సంబంధించిన అనుమతులు, లైసెన్సులు సకాలంలో తీసుకున్నాం. కావాలంటే తగిన పత్రాలను చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. నిబంధనల మేరకు పనిచేశాం అని వెల్లడించారు. అయితే, ఇళయరాజా వాదన దీనికి భిన్నంగా ఉండటంతో, పూర్తి విచారణ అనంతరం న్యాయస్థానమే తుది తీర్పును చెప్పనుంది. ఈ వివాదం టాలీవుడ్లో కాపీరైట్ హక్కులపై స్పష్టత అవసరం ఉందన్న దిశగా చర్చకు దారితీసింది. ప్రముఖ చిత్రాలకు సంబంధించిన మ్యూజిక్, రీమిక్స్, బిజి ఎంలు వాడే ముందు కచ్చితమైన అనుమతులు తీసుకోవడం అవసరం అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నెట్ఫ్లిక్స్లో అందుబాటులో లేదు. కోర్టు తుది తీర్పు వెలువడిన అనంతరం మాత్రమే, స్ట్రీమింగ్పై క్లారిటీ వస్తుంది.