భారత మహిళల క్రికెట్‌పై తనదైన ముద్రవేసి.. రెండు దశాబ్దాలుగా కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్న మిథాలీరాజ్ బాటలోనే హైదరాబాద్ నుంచి మరో యువ కెరటం దూసుకొస్తున్నది. దేశవాళీ టోర్నీల్లో పరుగుల వరద పారించడంతో పాటు అవసరమైతే బంతితోనూ సత్తా చాటగలనని నిరూపించుకుంటున్న ఆ యంగ్ తరంగ్ పేరే గొంగడి త్రిష. మూడేండ్ల ప్రాయంలోనే బ్యాట్ పట్టి.. ఏడేండ్ల వయసులో హైదరాబాద్ బాట పట్టిన.. ఈ భద్రాచలం బుల్లెట్.. టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది! జైపూర్‌లో జరిగిన అండర్-19 టోర్నీలో రికార్డు స్థాయి ప్రదర్శన చేసిన పదహారేండ్ల త్రిషతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
గత కొన్నేండ్లుగా సీనియర్ స్థాయిలో ఆడుతున్నా.. హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించే సమయంలో మిడిలార్డర్లో బ్యాటింగ్ అవకాశం వచ్చేది. జాతీయ మహిళల అండర్-19 చాలెంజర్ టోర్నీలో భారత్-‘బి’ తరఫున ఇన్నింగ్స్ ఆరంభించే చాన్స్ రావడంతో.. సత్తాచాటాలని ముందే అనుకున్నా. అందుకు తగ్గట్లే రాణించడం ఆనందంగా ఉంది.
మూడేండ్ల వయసులోనే బ్యాట్ పట్టుకొని షాట్లు ఆడుతుంటే మురిసిపోయిన మా నాన్న జీవీ రామిరెడ్డి.. ఎన్నో కష్టనష్టాలకోర్చి నా వెన్నంటి నిలువడం వల్లే ఇక్కడి వరకు వచ్చా. జాతీయ స్థాయి హాకీ ప్లేయర్ అయిన నాన్న అడుగడుగునా ప్రోత్సాహం అందిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. మెరుగైన శిక్షణ కోసం ఏడేండ్ల ప్రాయంలో హైదరాబాద్‌కు వచ్చాం. అప్పటి నుంచి క్రికెట్ ప్రాక్టీస్ అనేది నా జీవితంలో ఓ భాగమైంది.
ఊహా తెలియని వయసులోనే క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్నా.. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తాను. ఎనిమిదేండ్ల వయసు నుంచే ఏజ్ లెవల్ టోర్నీల్లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నా. మూడేండ్లుగా సీనియర్ స్థాయిలో ఆడుతున్నా. భారత్-బి తరఫున నాతో పాటు ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ అనుష్క శర్మతో చక్కటి సమన్వయం ఉంది. అందుకే మంచి భాగస్వామ్యాలు నమోదు చేయగలిగాం. సెంచరీ సహా రెండు అర్ధసెంచరీలతో 260 పరుగులు చేసి చాలెంజర్ టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచా. బ్యాటింగ్‌లోనే కాకుండా లెగ్‌స్పిన్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నా. 2.16 ఎకానమీతో పొదుపు పాటిస్తూ వికెట్లు పడగొట్టా.
నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తూ జాతీయ జట్టులోకి రావడమే నా ప్రస్తుత లక్ష్యం. కేవలం బ్యాటర్‌గానే కాకుండా.. ఆల్‌రౌండర్‌గా ముందుకు సాగాలనుకుంటున్నా. యువ ఓపెనర్ షఫాలీ వర్మ తరహాలో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడంతో పాటు.. అవసరమైతే బౌలింగ్‌లోనూ జట్టుకు తోడ్పడేందుకు ప్రయత్నిస్తా. ఫిబ్రవరిలో జరిగే అండర్-19 ప్రపంచకప్‌నకు ఎంపికవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నా.