Glenn Maxwell : ప్రపంచంలోని విధ్వంసక ఆల్రౌండర్లలో ఒకడైన గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) మైదానంలోకి దిగితే బౌండరీల వర్షమే. ఎంతటి బౌలర్‌కు అయినా చుక్కలు చూపించే మ్యాక్సీ.. ఐపీఎల్ 17వ సీజన్లో తన మార్క్ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. వరుస డకౌట్లతో రాయల్ చాలెంజర్స్(Royal Challengers Bengaluru) జట్టుకు భారంగా మారాడు. అయితే.. కీలకమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఆడకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగని కోచ్, కెప్టెన్లు మ్యాక్సీని పట్టనపెట్టలేదు. తనే స్వయంగా చిన్నస్వామిలో ఆడకూడదనే నిర్ణయం తీసుకున్నానని మ్యాక్స్‌వెల్ తాజాగా వెల్లడించాడు.
‘ముంబైతో మ్యాచ్ అనంతరం డూప్లెసిస్, కోచ్ ఆండీ ఫ్లవర్ దగ్గరకు వెళ్లి నా బదులు మరొకరిని ఆడించాలని చెప్పాను. గతంలోనూ చాలా సార్లు విఫలమయ్యాను. అయినా సరే మీరు నన్ను ఆడిస్తూ జట్టుకు నష్టం చేస్తున్నారు. నేను బ్యాటుతో పెద్దగా రాణించడం లేదు. మన జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. అందుకని నా బదులు మరొకరిని తీసుకోండి. వాళ్లు కచ్చితంగా మెరుస్తారు అని అన్నాను.
#GlennMaxwell pic.twitter.com/Ku7BFdqaVR
— Kaptan shahab (@NADEEM_242424) April 16, 2024
అంతేకాదు మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉండేందుకు ఇదే సరైన సమయం అని అనిపించింది. బ్రేక్ తర్వాత నా శరీరం లయ అందుకుంటుంది. అప్పుడే నేను మునపటిలా చెలరేగగలను’ అని మ్యాక్సీ తెలిపాడు. ఏప్రిల్ 21న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్ కల్లా మ్యాక్సీ ఫిట్‌గా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఫామ్ లేమితో సతమతమవుతున్న మ్యాక్స్‌వెల్ పదిహేడో సీజన్లో రెండంకెల స్కోర్ చేయలేపోయాడు. ఆర్సీబీకి ఎంతో కీలకమైన ముంబై ఇండియన్స్(Mumbai Indians) మ్యాచ్‌లో అతడు డకౌట్ అయ్యాడు. స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్(Shreyas Gopal) బౌలింగ్‌లో సున్నాకే వెనుదిరిగి చెత్త రికార్డు మూటగట్టుకన్నాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 17 సార్లు డకౌట్ అయిన మూడో ఆటగాడిగా మ్యాక్సీ రికార్డు కొట్టాడు. అదే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ గాయపడ్డాడు. సూర్యకుమార్ యాదవ్ కొట్టిన బంతిని అందుకోబోగా మ్యాక్సీ కుడిచేతి బోటన వేలికి బలమైన గాయమైంది. దాంతో, అతడు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే.
ఐపీఎల్ 16వ సీజన్లో కోహ్లీ, డూప్లెసిస్ జతగా మ్యాక్స్‌వెల్ బౌలర్లను ఉతికేశాడు. దాంతో, అతడిపై ఆర్సీబీ ఈసారి కూడా భారీ ఆశలే పెట్టుకుంది. పైగా.. వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో మ్యాక్సీ అఫ్గనిస్థాన్‌పై డబుల్ సెంచరీతో ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో గెలిపించాడు. తన అసమాన పోరాటంతో ఆసీస్‌కు సెమీస్ బెర్తు ఖాయం చేశాడు. ఇక రాబోయే సీజన్లో అతడి ఆటకు తిరుగులేదని ఆర్సీబీ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, మ్యాక్సీ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఇప్పటివరకూ ఆరు మ్యాచుల్లో కేవలం 23 రన్స్ కొట్టాడంతే.