హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : కొత్తగా నాలుగేండ్ల బీఈడీ కోర్సులు రెండు ప్రవేశపెట్టినట్టు గీతం డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు వెల్లడించారు. పటాన్చెరు-రుద్రారంలోని తమ వర్సిటీలో బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులు ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ కోర్సుల నిర్వహణకు వర్సిటీలో కొత్తగా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను స్థాపించామని పేర్కొన్నారు. బుధవారం బేగంపేటలోని ఓ హోటల్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. బోవర్ స్కూల్ ఆఫ్ అంత్రప్రెన్యూర్‌షిప్ సహకారంతో బీబీఏ (అంత్రప్రెన్యూర్‌షిప్), బీఎస్సీ మైక్రోబయాలజీ, ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ, ఎంటెక్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను సైతం ఈ విద్యాసంవత్సరం ప్రవేశపెట్టామని వెల్లడించారు.
ఎం ఫార్మా (ఇండస్ట్రియల్ ఫార్మసీ) కోర్సుకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందాల్సి ఉన్నదని తెలిపారు. గీతం అడ్మిషన్ టెస్ట్(గాట్) 2026 పరీక్షను ఈ నెల 28న ఆన్లైన్లో జాతీయంగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. 26లోపు ఆశావహులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. పరీక్షలో ప్రతిభ చూపిన వారు ట్యూషన్ ఫీజు, హాస్టల్, వందశాతం స్కాలర్షిప్ పొందవచ్చని తెలిపారు. ప్లేస్‌మెంట్స్‌లో వర్సిటీ అనేక విజయాలు నమోదు చేసిందని, 350కి పైగా కంపెనీలతో ఒప్పందాలు కొనసాగిస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ప్రతినిధిలు రీచాశర్మ, రమేశ్ వడ్డీ, డాక్టర్ శామ్యూల్, మమత, మోర్తాజా రెజా తదితరులు పాల్గొన్నారు.