ప్రేమకథా చిత్రాలంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని చెప్పింది బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికాపడుకోన్. కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో భాగమయ్యానని, పాత్రలపరంగా ప్రయోగాలు చేశానని..అయితే లవ్‌స్టోరీస్‌లో ఉండే మ్యాజిక్ వేరని ఆనందం వ్యక్తం చేసింది. ఆమె కథానాయికగా నటించిన ప్రేమకథా చిత్రం ‘గెహ్రాయాన్’ టీజర్ మంగళవారం విడుదలైంది. శకున్బాత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ చతుర్వేది హీరోగా నటించారు. టీజర్ భావోద్వేగభరిత రొమాంటిక్ సన్నివేశాలతో సాగింది. దీపికాపడుకోన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా. నిరీక్షణ తాలూకు ఫలితం ఎప్పుడూ మధురంగానే ఉంటుంది. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమా అందరికి నచ్చుతుంది’ అని పేర్కొంది. జనవరి 25న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలకానుంది.