న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఇండ్లకు, సీఎన్జీ గ్యాస్ స్లేషన్లకు పైప్డ్ గ్యాస్‌ను అందించేందుకు ఉద్దేశించిన సిటీ గ్యాస్ త్వరలో నిజామాబాద్‌కు రానుంది. 11వ లైసెన్సింగ్ రౌండ్లో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో సిటీ గ్యాస్ పంపిణీ కోసం మౌలిక సదుపాయాల ఏర్పాటుకు బిడ్డింగ్ డిసెంబర్ 15న పూర్తయినట్టు పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (పీఎన్జీఆర్బీ) తెలిపింది. తాజా రౌండ్లో 19 రాష్ర్టాల్లో 215 జిల్లాల్లో విస్తరించి ఉన్న 65 భౌగోళిక ప్రాంతాలకు (జీఏలు) బిడ్స్‌ను ఆఫర్ చేశారు. వీటిలో ఒక జీఏగా తెలంగాణలోని నిజామాబాద్‌లో గ్యాస్ పంపిణీ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు బిడ్డింగ్ జరిగింది. 61 జీఏలకు మొత్తం 430 బిడ్స్ అందాయని పీఎన్జీఆర్బీ తెలిపింది. ఈ ప్రాంతాలన్నింటిలోకి మొత్తం రూ. 80,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, అనేకమందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. వీటికి సంబంధించి టెక్నికల్ బిడ్స్‌ను డిసెంబర్ 17-22 మధ్యకాలంలో తెరవనున్నట్టు తెలిపింది.