న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రధాని నరేంద్రమోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో నిర్మించిన గుజరాత్ అంతర్జాతీయ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్)లో విదేశీ విశ్వవిద్యాలయాలు నెలకొల్పేందుకు కేంద్రప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. ఇదే గిఫ్ట్ సిటీలో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కార మధ్యవర్తిత్వ కేంద్రం (ఆర్బిట్రేషన్ సెంటర్) నెలకొల్పనున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక్కడ నెలకొల్పే యూనివర్సిటీలకు దేశీయ నియమ నిబంధనల నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన వర్సిటీలు ఇక్కడ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఫిన్టెక్, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం తదితర కోర్సులు నిర్వహించేందుకు స్వేచ్ఛగా తమ కేంద్రాలను నెలకొల్పవచ్చని ప్రకటించారు. ఆర్థిక, వాణిజ్యరంగంలో దేశీయ నిపుణులను తయారుచేసేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు.
ఆర్బిట్రేషన్ సెంటర్
కంపెనీల మధ్య ఏర్పడే న్యాయ వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు గిఫ్ట్ సిటీలో ఆర్బిట్రేషన్ సెంటర్ నెలకొల్పుతున్నట్టు బడ్జెట్లో పేర్కొన్నారు. సింగపూర్, లండన్లో ఉన్న ఆర్బిట్రేషన్ సెంటర్ల స్థాయిలో దీనిని నెలకొల్పనున్నట్టు నిర్మల వెల్లడించారు. గత నెలలోనే హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.