Foods For Heart Health | ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే గుండె జబ్బులు లేదా హార్ట్ ఎటాక్స్ వచ్చేవి. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులోనే ఈ జబ్బుల బారిన పడుతున్నారు. హార్ట్ ఎటాక్‌లు అనేవి ప్రస్తుతం సర్వ సాధారణం అయ్యాయి. అయితే ఒక సారి హార్ట్ ఎటాక్ వచ్చి కోలుకున్న వారు లేదా గుండె జబ్బులతో బాధపడుతున్నవారు తమ గుండె ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేదంటే పరిస్థితి ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక గుండె సమస్యలు ఉన్నవారు డాక్టర్లచే చికిత్స తీసుకోవడంతోపాటు ఆహారం విషయంలో పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
గుండె జబ్బులు లేదా హార్ట్ ఎటాక్‌లు వచ్చి కోలుకుంటున్న వారు, గుండె బలహీనంగా ఉన్న వారు రోజూ పరగడుపునే ఒక కప్పు సొరకాయ జ్యూస్ తాగితే మంచిది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే గుమ్మడికాయ విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా సీడ్స్, అవిసె గింజలు వంటి విత్తనాలను తీసుకోవాలి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. అందువల్ల ఆయా ఆహారాలను తీసుకుంటే గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. ఇక ఆయా విత్తనాలను అన్నింటిని కలిపి రోజుకు గుప్పెడు మోతాదులో తినవచ్చు. దీంతో గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వెల్లుల్లిని తీసుకోవాలి. రోజూ ఉదయాన్నే పరగడుపునే 2 వెల్లుల్లి రెబ్బలను బాగా నమిలి మింగాలి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఇక గుండె ఆరోగ్యం కోసం రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాలి. కనీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి. వారంలో కనీసం 5 రోజుల పాటు రోజుకు 30 నిమిషాల చొప్పున మొత్తం వారంలో 150 నిమిషాలు వ్యాయామం అయ్యేలా చూసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. గుండెకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే వారానికి ఒకసారి ఆవ నూనె లేదా నువ్వుల నూనెను కాస్త వేడి చేసి శరీరమంతా మర్దనా చేసుకోవాలి. తరువాత గంట సేపు అయ్యాక స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా ఉంటుంది. ఇక గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కాఫీ, టీలను తగ్గించాలి. అందుకు బదులుగా గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ లను తాగాలి.
గుండె ఆరోగ్యంగా ఉండేందుకు గాను మద్యం సేవించడం, పొగ తాగడం మానేయాలి. ఇవి గుండె ఆరోగ్యానికి తీవ్రంగా హాని చేస్తాయి. కనుక ఈ అలవాట్లు ఉంటే మానుకోవాలి. అలాగే చేపలు, ఆలివ్ నూనె, వాల్ నట్స్, బాదంపప్పులను తీసుకోవాలి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక వీటిని తరచూ తీసుకోవడం మంచిది. అదేవిధంగా చిలగడదుంపలు, నారింజ పండ్లు, బార్లీ, ఓట్స్, చెర్రీలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అయితే గుండె సమస్యలు ఉన్నవారు పాలు, పెరుగు తీసుకుంటే పూర్తిగా కొవ్వు తీసినవి తీసుకోవాలి. ఇలా ఆహారాల విషయంలో జాగ్రత్తలను పాటిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.