Folk Singer Narella Srinidhi | వకీల్ కావాలన్నది ఆమె కోరిక. మధ్యలో పాట ప్రవేశించింది. పాటలంటే ఇష్టమే. కానీ, సింగర్‌గా సెటిలైపోయేంత సీరియస్‌గా కాదు! అయితే, ఆ పాట ఆమె ఆలోచననే మార్చేసింది. వకీల్ నుంచి గాయనిగా స్థిరపడాలన్న నిశ్చయానికి వచ్చేసింది. తొలిపాటతోనే అభిమానుల్ని సంపాదించుకొని జానపదాలను సెలయేళ్లలా పారిస్తున్న నారెళ్ల శ్రీనిధి పాటల ముచ్చట!
మాది కరీంనగర్‌లోని మంకమ్మతోట. నాన్న హన్మయ్య, అమ్మ మంజుల. నా విద్యాభ్యాసం వాణి నికేతన్ పాఠశాలలో సాగింది. ఒకరకంగా అక్కడే నా పాటలకు బీజం పడింది. ఆరేండ్ల వయసులోనే స్టేజీ మీద పాటలు పాడటం, బతుకమ్మ పోటీల్లో పెద్దవాళ్లతో పోటీపడి బహుమతులు అందుకోవడంతో పాటకు దగ్గరైన. పాటవల్ల ఎలాంటి గుర్తింపు వస్తదో, పాడితే ఎంత కిక్ ఉంటదో అప్పుడే తెలిసింది.
2015లో బతుకమ్మ పాటల పోటీల్లో పాల్గొని మొదటి బహుమతి పొందిన. 2018లో రాష్ట్రస్థాయి ‘కళోత్సవం’ పోటీల్లో పాల్గొని మూడో స్థానంలో నిలిచిన. హేమాహేమీలు ఆ పోటీల్లో పాల్గొన్నరు. పాటల వల్ల నా చదువుకు ఇబ్బంది అవుతుందేమో అనుకున్నరు అమ్మానాన్న. కానీ, పాల్గొన్న ప్రతి పోటీలో బహుమతి గెలుచుకోవడంతో ఎంతగానో ప్రోత్సహించిండ్రు. ఒకసారి ‘బోల్ బేబీ బోల్’ సెలక్షన్స్ జరిగితే పాల్గొన్న. బాగా పాడిన కూడా. గ్రీన్ బ్యాండ్ ఇచ్చిండ్రు. కరీంనగర్ నుంచి గ్రీన్బ్యాండ్ వచ్చింది ఇద్దరికే. దాంట్లో నేనుండటం నిజంగా గ్రేట్ అనిపించింది. డైరెక్ట్‌గా ప్రోగ్రామ్‌కి వెళ్లడమే మిగిలింది. కానీ, ఏమైందో ఏమో వాళ్ల నుంచి ఎటువంటి కాల్ రాలేదు. తర్వాత కనుక్కున్నా సమాధానం దొరకలేదు. అప్పుడు కొంత బాధ అనిపించింది. సెలెక్ట్ కాకపోతే అది వేరే విషయం. సెలక్టయ్యాక కూడా ఎందుకు పిలవలేదో అర్థంకాలేదు. దీంతో కొంతకాలం పాటలకు దూరంగా ఉన్న.
నన్ను, నా పాటను పరిశీలించినవారిలో అందరూ ఒక ఎత్తయితే మా కజిన్ మానసక్క ఒకెత్తు. అందరిలెక్క తను చప్పట్లకే పరిమితం కాలేదు. నా పాటను ప్రపంచానికి తెలియజేయాలనుకున్నది. నేను పాడటం నాకంటే కూడా తనకే ఎక్కువ ఇష్టం. ఎప్పుడైన ‘నా వల్ల కాదు’ అని నిరుత్సాహపడితే ‘లేదులేదు.. నువ్వు పాడగలవు..’ అని నన్ను ప్రోత్సహించింది. ఒకవేళ మా అక్క ప్రోత్సాహం లేకపోతే నేను ఈ రంగంలోకి రాకపోదును. అక్కవాళ్ల క్లాస్మేట్ వెంకటేశన్న బెంగళూరులో ఉంటడు. అన్నకు జానపదాలు అంటే ఇష్టం. ఎప్పటికీ గుర్తుండిపోయే జానపదాలను యూట్యూబ్‌లో ఫైల్ చేయాలనేది ఆయన కోరిక. ఇదే విషయం మానసక్కతో చెప్తే ‘మా చెల్లె బాగా పాడుతది. తనకు అవకాశం ఇస్తే బాగుంటది’ అని నా పేరును సూచించింది. అట్లా 2019లో ‘ఓ సందమామ నా మేనబావ జాడలేడాయె.. ఎదురురాడాయె’ పాట పాడే అవకాశం లభించింది. రికార్డింగ్‌లో తొలి పాటే అయినా మెచ్యూర్డ్‌గా పాడిన అనే ప్రశంసలు వచ్చినయి. పాటకూడా బాగా హిట్టయింది. వెంకటేశన్నకు, సింగర్‌గా నాకూ మంచి గుర్తింపు వచ్చింది.
‘ఓ సందమామ’ సాంగ్ రికార్డింగ్ చేసినప్పుడు ప్రోగ్రామర్ మహేందరన్న ‘బాగా పాడుతున్నవ్. నీ కాంటాక్ట్ నంబర్ ఇచ్చి వెళ్లు. ఎవరైనా కొత్తవాళ్లతో పాడించేవాళ్లుంటే చెప్తా’ అనడంతో నంబర్ ఇచ్చిన. కొద్దిరోజులకు కాల్ చేసినరు. ‘అద్దాల సీరగట్టి అందాల రైక తొడిగి సెంద్రవొంక బొట్టువెట్టి’ పాట పాడే అవకాశం ఇచ్చిండ్రు. ‘సిలకపచ్చ సీరగట్టి ఓ సిన్నదాన సిన్నంగవోత ఉంటే సక్కాని భామ’ పాట నాకు బ్రేక్ ఇచ్చింది. ఫోక్ సర్కిల్లో ఈ పాట బాగా వైరల్ అయ్యింది. దీంతో అవకాశాలు మరిన్ని పెరిగినయి. ‘సిలకపచ్చ సీరగట్టి సింగర్వి కదా’ అని గుర్తించే స్థాయికి ఎదిగిన. ఇక నన్ను ఎక్కువమందికి తెలిసేలా ఫేమస్ చేసిందైతే ‘గల్ గల్ గజ్జెల బండిలో బండిలవోయేదెవరుల్లో.. ముద్దు మేనబావల్లో’ పాట. ‘నీ ముక్కూ మీదుంది మూడురాళ్ల ముక్కుపుల్ల’ పాట కూడా బాగా హిట్టయింది. ఇట్లా మొత్తం 45 పాటలకు పైగా పాడిన. ఇంకా పది దాకా విడుదల కావాల్సి ఉంది. అయితే, ‘సెలయేళ్లు పారుతుంటే ఓ పిల్ల.. ఎదగూళ్లూగుతుండే లోలోన’ పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తిపాట రాకముందే ఇది వైరల్ అయింది. ఇన్‌స్టా, యూట్యూబ్ రీల్స్‌లో ఈ పాటదే
ఇప్పటికీ హవా.
రికార్డింగ్స్‌కి ఏ టైమ్‌లో అంటే ఆ టైమ్‌లో వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఒకేరోజులో మూడు నాలుగు పాటల రికార్డింగ్ ఉంటుంది. కొన్నిసార్లు తినడానికి కూడా వీలుండదు. దగ్గరివాళ్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసే స్థితిలో ఉండం. వీటిని సమస్య అనుకోకుండా, నాకు లభించిన అవకాశంగా అనుకుంట. మా నాన్న బిజినెస్‌లో బిజీగా ఉంటడు. అమ్మ జాబ్‌లో బిజీగా ఉంటుంది. వాళ్లు రిలాక్స్ కావాలన్నా నా పాట వినాల్సిందే. నేను రిలాక్స్ కావాలన్నా పాట పాడాల్సిందే. ఒక రకంగా చాలా సాఫీగా, సంతోషంగా కెరీర్ సాగిపోతున్నది. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా నేనో పాట అందుకునేదాక ఎవరూ ఊరుకోరు. స్నేహితులు, బంధువుల్లో నేను ఇప్పుడు సెలెబ్రిటీని. కొందరైతే ఆటపట్టిస్తుంటారు కూడా. ఇవన్నీ చూస్తుంటే సంబురం అనిపిస్తుంటది. ఎందుకంటే ఇక్కడ నేను పెద్దగా ఏదీ ప్లాన్ చేసుకోలేదు. మొదట ఒక ప్రయత్నం చేసిన. అది సెట్టయ్యింది. తర్వాత అవకాశాలు వచ్చినయి. ఒకవేళ నేను వద్దనుకున్నా మావాళ్లు, స్నేహితులు, నా పాటల్ని అభిమానించేవాళ్లు ఊరుకునేలా లేరు.
నాకు ‘లా’ చేయాలని ఉండేది. చిన్నప్పటినుంచి ఎందుకోగానీ వకీల్ కావాలని కలలు కనేదాన్ని. ఒకవేళ సింగింగ్‌లోకి వెళ్తే కర్ణాటక సంగీతం నేర్చుకోవాలని అనుకున్నా. కానీ, పూర్తిస్థాయిలో జానపదాలు పాడతానని ఊహించలేదు. మొదటి పాట నుంచే ప్రేక్షకుల ఆదరణ, గుర్తింపు వచ్చినయి. పాడిన ప్రతి పాటనూ ఆదరించిండ్రు. కోరుకోకుండానే ఇంత పేరు, గుర్తింపు, సంతృప్తి దొరికినంక ఈ రంగంలోనే ఎందుకు ఉండకూడదు అనిపించింది. ‘లా’ కలను అటకెక్కించిన. సంగీతంలో శిక్షణ లేకున్నా ఇక్కడిదాక వచ్చిన. రాబోయే రోజుల్లో శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకోవాలి అనుకుంటున్న. మ్యూజిక్ డిప్లొమా అయిన తర్వాత పూర్తిస్థాయి పాటల పోటీల్లో పాల్గొనాలని భావిస్తున్న. ఒకవైపు పాటలు పాడుతూనే మరోవైపు చదువు కొనసాగిస్త.
… దాయి శ్రీశైలం
Folk Singer Lavanya Ravinder | పెండ్లి నా పాటను పంజరంలో బంధిస్తే.. పిల్లలు విముక్తి కల్పించిండ్రు.”
“కూలీ పని చేసుకునే నన్ను పల్లె పాట పాపులర్ చేసింది !!”
Mukunda | మంచి ఫోక్ సింగర్ కావాలన్నదే లక్ష్యం.. పెద్ద సినిమాకు పాడటం నా డ్రీమ్”
Janaki Srinivas | మూడో తరగతిలో పాడిన పాట ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది”