న్యూఢిల్లీ : ప్రతి 10 మంది యువ భారతీయుల్లో ఏడుగురు తమ మొదటి ఉద్యోగాన్ని సాధించడం మూడు నుంచి ఐదేండ్ల క్రితం కంటే ఇప్పుడు మరింత కష్టతరంగా మారిందని నమ్ముతున్నారు. ఎందుకంటే యజమానులు ఎంట్రీ లెవల్ ఉద్యోగాల కోసం కూడా ముందస్తు అనుభవాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇన్‌డీడ్ సంస్థ దేశవ్యాప్తంగా 2,633 మంది ఉద్యోగాన్వేషకులు, ఉద్యోగుల మధ్య నిర్వహించిన సర్వేలో 72 శాతం మంది ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు తరుచుగా గత పని అనుభవం అవసరమవుతుందని భావిస్తున్నట్టు తేలింది. ఇది శ్రామిక మార్కెట్లోకి ప్రవేశిస్తున్న కొత్త గ్రాడ్యుయేట్లకు “అనుభవ వైరుధ్యాన్ని” సృష్టిస్తున్నది. టెక్నాలజీ, సర్వీసెస్, ఈకామర్స్ వంటి రంగాల్లో నిరంతర వృద్ధి ఉన్నప్పటికీ, భారతదేశపు ఉద్యోగ మార్కెట్లో యువ నిపుణులు ఎదుర్కొంటున్న పెరుగుతున్న సవాళ్లను ఈ పరిశోధనలు హైలైట్ చేస్తున్నాయి. కేవలం 14 శాతం మం ది మాత్రమే తాము ఆశించిన మొదటి ఉద్యోగం తమకు నచ్చిన పాత్ర, కంపెనీ, ప్రాంతానికి సరిపోలుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా, 43 శాతం మంది ఆర్థిక ఒత్తిళ్లు లేదా అవకాశాల కొరత కారణంగా తమ కేరీర్ ఎంపికలో రాజీ పడాల్సి వస్తున్నదని చెప్పారు. “చాలామంది యువకులకు మొదటి ఉద్యోగం అనేది కేవలం కాలేజీ నుంచి కేరీర్‌కు మారే సాధారణ ప్రక్రియగా మిగలలేదు. ఇది నిరంతర దరఖాస్తులు, ఆలస్యమైన ప్రతిస్పందనలు, రాజీ పడాలనే పెరుగుతున్న ఒత్తిడితో కూడిన అనిశ్చితమైన దశగా మారుతున్నది” అని ఇన్‌డీడ్ టాలెంట్ స్ట్రాటజీ అడ్వైజర్ రోహన్ సిల్వెస్టర్ చెప్పారు.
యజమానుల దృష్టిలో పడడం అనేది ఒక పెద్ద అడ్డంకిగా మారిందని ఈ సర్వే సూచిస్తున్నది. దాదాపు సగంమంది (49 శాతం) నియామక ప్రక్రియలో షార్ట్‌లిస్ట్ కావడమే అతిపెద్ద సవాలుగా భావిస్తున్నారు. కాగా 61 శాతం మంది ఉద్యోగ దరఖాస్తులను సమర్పించిన తర్వాత తమకు అస్సలు లేదా అరుదుగా మాత్రమే సమాధానం వస్తున్నదని చెప్పారు. పని అనుభవ అవకాశాలు పరిమితంగా లభించడం ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నది. తమ చదువుల సమయంలో వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్ సౌకర్యం ఉన్నదని ప్రతి ఐదుగురిలో ఒకరు చెప్పగా, 18 శాతం మంది తమకు ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు, ప్లేస్మెంట్లు లేదా ఫ్రీలాన్స్ పనులకు ఎలాంటి అవకాశం లేదని చెప్పారు.
సుదీర్ఘమైన ఉద్యోగాన్వేషణ యువ అభ్యర్థులపై మానసిక ప్రభావం చూపుతున్నది. పదేపదే దరఖాస్తు చేయడం, తిరస్కరణకు గురికావడం వల్ల తమ ఆత్మవిశ్వాసం, ప్రేరణ తగ్గాయని దాదాపు 64 శాతం మంది చెప్పారు. కాగా కేవలం 20 శాతం మంది మాత్రమే తాము ప్రస్తుతం అనుకున్న కెరీర్ మార్గంలో ఉన్నట్టు భావిస్తున్నారు. దేశంలో యువత ఉపాధిపై విస్తృతమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. గ్రాడ్యుయేట్లలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి విధాన రూపకర్తలు నైపుణ్యాభివృద్ధి, అప్రెంటిస్‌షిప్‌లు, పరిశ్రమవిద్యాసంస్థల భాగస్వామ్యాలను ఎక్కువగా నొక్కి చెబుతున్నారు. ఇన్‌డీడ్ ప్రకారం.. ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్మెంట్ సెల్లు, రెజ్యూమ్ గైడెన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వంటి నిర్మాణాత్మక సహాయక వ్యవస్థలు ప్రారంభ కెరీర్ ఫలితాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.