ఇస్లామాబాద్, మార్చి 31: ప్రధాని పదవికి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేశారు. చివరి బంతి దాకా ఆడతానని, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటానని తేల్చి చెప్పారు. గురువారం రాత్రి ఆయన పాక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి అమెరికానే కుట్ర పన్నిందని వెల్లడించి సంచలనం సృష్టించారు. అయితే, అమెరికా పేరును వెల్లడించడంపై ఆయన నాలుక్కరుచుకొన్నట్టు ప్రసంగం వీడియోలో స్పష్టంగా కనిపించింది. పాక్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి అంతర్జాతీయ కుట్ర జరిగిందని ఇమ్రాన్ కొన్ని రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తనను పదవి నుంచి దించేందుకు చర్యలపై అమెరికా పాక్‌లోని రాయబార కార్యాలయానికి లేఖ రాసిందని, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా సూచించిందని ఇమ్రాన్ వెల్లడించారు. ఇమ్రాన్ ఆరోపణలను అమెరికా ఖండించినట్టు వార్తా కథనాలు వచ్చాయి.
జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు ఇమ్రాన్ ఖాన్ విపక్షాలకు కీలక ప్రతిపాదన చేశారు. తనపై అవిశ్వాసాన్ని వెనక్కు తీసుకొంటే లోక్‌సభను రద్దు చేస్తానని ప్రకటించారు. తద్వారా మళ్లీ ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధపడ్డారు. అయితే, ఈ ప్రతిపాదనను విపక్షాలు తిరస్కరించాయి. అవిశ్వాసంపై ఆదివారమే ఓటింగ్ జరగనున్నది.