FIFA WorldCup 2026 | ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-సి ఓపెనింగ్ మ్యాచ్‌లో బ్రెజిల్, మొరాకో జట్ల మధ్య జరిగిన పోరు 1-1 తో డ్రాగా ముగిసింది. న్యూజెర్సీలోని స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గట్టి పోటీని ఇచ్చాయి. మ్యాచ్ ప్రారంభమైన 20వ నిమిషంలో మొరాకో ఆటగాడు ఇస్మాయిల్ సైబారి ఒక అద్భుతమైన గోల్ చేసి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత బ్రెజిల్ జట్టు పుంజుకుని ఎదురుదాడికి దిగింది. మ్యాచ్ 31వ నిమిషంలో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ వినిసియస్ జూనియర్ సూపర్ గోల్ చేయడంతో స్కోరు 1-1 తో సమమైంది. వినిసియస్ జూనియర్‌కు బ్రెజిల్ తరఫున ఇది 50వ మ్యాచ్ కాగా, అందులో ఆయన 10వ అంతర్జాతీయ గోల్‌ను నమోదు చేయడం విశేషం.
తొలి అర్ధభాగంలో మొరాకో జట్టు మంచి ప్రతిభ కనబరిచినప్పటికీ, రెండో అర్ధభాగంలో ఇరు జట్లు తమ డిఫెన్స్‌ను బలోపేతం చేశాయి. రెండు జట్ల రక్షణ శ్రేణి అప్రమత్తంగా ఉండటంతో సెకండ్ హాఫ్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో మ్యాచ్ చివరి వరకు 1-1 తోనే నిలిచింది. ఈ డ్రాతో ఇరు జట్లు చెరో పాయింట్‌ను పంచుకున్నాయి. అలాగే వరల్డ్ కప్ చరిత్రలో 1934 నుండి సాగుతున్న తన అజేయ ఓపెనింగ్ రికార్డును బ్రెజిల్ మరోసారి కాపాడుకుంది.