Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’లో నటిస్తున్నాడు. అలాగే దర్శకులు రవి కిరణ్ కోలా, శౌర్యువ్లతో కూడా సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పలువురు ప్రతిభావంతులైన దర్శకులతో సినిమాలు లైన్లో పెట్టుకున్న విజయ్, తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె కుమార్‌తో విజయ్ దేవరకొండ సినిమా చేయనున్నాడని టాక్ నడుస్తోంది.
సమాచారం ప్రకారం, విక్రమ్ కె కుమార్ మొదట ఈ కథను హీరో నితిన్‌తో తెరకెక్కించాలని భావించారు. అయితే ఆ ప్రాజెక్ట్ అనుకోని కారణాలతో నిలిచిపోవడంతో, ఇప్పుడు అదే కథను విజయ్ దేవరకొండతో రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే భారీ కథాంశంతో రూపొందనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా విక్రమ్ కుమార్ ఈ స్క్రిప్ట్‌పై ప్రత్యేకంగా పని చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.అంతేకాకుండా, ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని బాలీవుడ్లో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ‘స్త్రీ 2’, ‘ముంజ్యా’, ‘ఛావా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న ఈ సంస్థ, ఇప్పుడు విజయ్ దేవరకొండతో తెలుగు మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దర్శకుడు విక్రమ్ కె కుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ నిజమైతే, ఇది టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.