Chiranjeevi | తరాలు మారిన మెగాస్టార్ క్రేజ్ ఏమాత్రం తగ్గదు. ఆయన సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతూనే ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి జర్నీ దాదాపు ఐదు దశాబ్దాలుగా సాగుతుంది. చిరంజీవి 1978లో నటుడిగా మారారు. `పునాదిరాళ్లు` చిత్రంలో నటించి నటుడిగా మారిన చిరంజీవి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మెగాస్టార్‌గా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇప్పటికీ చిరంజీవి యువకులకి పోటీగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఇక ఆయన అభిమాన గణం రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఆయనకి మన ఇండియాలోనే కాదు విదేశాలలోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అమెరికాలో ఉన్న డాక్టర్ ఇస్మాయిల్ సుహైల్ పెనుకొండ మెగాస్టార్ చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్ కాగా, ఆయన తన టెస్లా కారుకు ‘మెగాస్టార్’ అని వచ్చేలా నంబర్ ప్లేట్ వేయించుకున్నాడు. టోటల్ టెక్సాస్ లో చూస్తే… ఈ నంబర్ ప్లేట్ ఉన్న కారు ఇదొక్కటే ఉంటుంది. మనోడు చిరంజీవిపై ఎప్పటికప్పడు తన అభిమానం చూపిస్తూ ఉంటారు. ఇక చిరంజీవి రీసెంట్గా యూకే పార్లమెంట్లో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకోవడానికి లండన్ వెళ్లారు. ఆయన హీత్రూ విమానాశ్రయంలో దిగగానే, అభిమానులు, తెలుగు ప్రవాసులు చిరుకి ఘన స్వాగతం పలికేందుకు అక్కడికి భారీగా చేరుకున్నారు.
అయితే ఒక మహిళా అభిమాని చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకోవడం ద్వారా తన అభిమానాన్ని చాటుకుంది.. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవిని ముద్దు పెట్టుకున్న మహిళ కుమారుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “చిన్నప్పుడు, నేను చిరంజీవిని కలవాలని పట్టుబట్టేవాడిని. ఈరోజు, నా తల్లిని అతనిని కలవడానికి తీసుకెళ్లాను” అని రాసుకొచ్చారు. ఈ పిక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అయితే మహిళా అభిమాని ముద్దు పెడుతున్న సమయంలో చిరు చిన్న చిరునవ్వు నవ్వడం ఫొటోలో గమనించవచ్చు. ఇక బుధవారం సాయంత్రం చిరంజీవిని యూకే పార్లమెంట్లో జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నారు. నాలుగు దశాబ్దాలుగా సినిమా, సామాజిక సేవకు ఆయన చేసిన కృషికి గాను ఆయనకి ఈ గుర్తింపు దక్కింది.