చండీఘడ్: ఆజ్ కల్ తేరె మేరే ప్యార్ కే చర్చే.. అంటూ సాగే ఓ హిందీ పాటకు జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లా చిందేశారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో కలిసి ఆయన స్టెప్పులేశారు. చండీఘడ్‌లో జరిగిన పెళ్లి వేడుకలో పాల్గొన్న ఫారూక్ అబ్దుల్లా ఫుల్ జోష్‌లో డ్యాన్స్ చేశారు. బ్లూ షేర్వానీ వేసుకున్న ఫారూక్.. కాసేపు ఒంటరిగానే తన్మయత్వంలో తేలిపోయారు. సీఎం అమరీందర్ సింగ్ మనువరాలు షెహరిందర్ కౌర్ పెళ్లికి వచ్చిన ఫారూక్ .. ఓల్డ్ హిందీ సాంగ్స్‌కు స్టెప్పులేశారు. తాను డ్యాన్స్ చేయడమే కాకుండా.. కెప్టెన్ అమరీందర్‌ను కూడా చిందేసేలా చేశారు. ఇద్దరు రాజకీయవేత్తలు అలనాటి హిందీ పాటలకు ఊగిపోయారు. ఆజ్ కల్ తెరె మేరే ప్యార్ కే చర్చే.. గులాబీ ఆంకే జో తేరి దేకి లాంటి పాటలకు ఇద్దరూ చిందేశారు. 1960, 70 దశకాల్లో ఆ పాటలు యువతను హోరెత్తించాయి. అమరీందర్ సింగ్ కుమారుడు రాణిందర్ సింగ్ కుమార్తె షెహరిందర్ కౌర్ పెళ్లికి ఫారూక్ హాజరయ్యారు. ఢిల్లీ వ్యాపారవేత్త దేవిన్ నారంగ్ కుమారుడు ఆదిత్య నారంగ్‌ను అమరీందర్ మనువరాలు పెళ్లి చేసుకున్నది. పంజాబ్ సీఎం అమరీందర్.. తన ఫార్మ్‌హౌజ్‌లో జరిగిన ఈవెంట్లో పంజాబీ సుహాగ్ పాటల్ని కూడా పాడారు.