చలికాలం మొదలైంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జలుబు, సైనస్ లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. దగ్గు, గొంతు నొప్పి వేధిస్తుంటాయి. ఈ ఆరోగ్య సమస్యలకు పచ్చిమిర్చితో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. దాంతోపాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని అంటున్నారు.
కూరల్లో కారం కోసం ఉపయోగించే పచ్చి మిరప కాయలు ఆరోగ్యానికీ ఎంతో మేలుచేస్తాయి. విటమిన్లతో నిండిన మిర్చీలు.. రోగనిరోధక శక్తిని పెంచడంలో ముందుంటాయి. ముఖ్యంగా, చలికాలంలో వేధించే జలుబు, సైనస్ను తగ్గించడంలో సాయపడతాయి. ఆహారంలో పచ్చిమిర్చిని చేర్చడం ద్వారా.. శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి. పచ్చిమిరపలో యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలం. ఇవి గొంతు ఇన్ఫెక్షన్లు, పొట్టలో అల్సర్లను తగ్గిస్తాయి. పచ్చిమిర్చిని రెగ్యులర్గా తీసుకుంటే.. సైనస్ కఫం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గును నియంత్రణలో ఉంచడానికి పచ్చిమిర్చిని తీసుకోవాలని వైద్య నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు.
వీటిని రెగ్యులర్గా తీసుకుంటే.. ముక్కు దిబ్బడ తగ్గుతుంది. శ్వాస క్లియర్ అవుతుంది. సైనసైటిస్ లక్షణాలను తగ్గించడంలోనూ పచ్చిమిర్చి పనిచేస్తుంది. అంతేకాకుండా మిరపకాయలోని క్యాప్సైసిన్ అనే పదార్థం.. జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. ఇక ఇందులో నారింజ కంటే ఆరు రెట్లు ఎక్కువగా విటమిన్ సి లభిస్తుందట. ఇది రోగనిరోధక శక్తిని పెంచి.. వ్యాధుల నుంచి రక్షిస్తుంది. పచ్చి మిరపకాయల్లోని ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి యాంటి ఆక్సిడెంట్లు.. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. ఇందులోని శక్తిమంతమైన సహజ రసాయనాలు.. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలవట. శరీరంలోని హానికరమైన కణాల పెరుగుదలను క్యాప్సైసిన్ అడ్డుకుంటుందని పలు అధ్యయనాల్లోనూ తేలింది.