AP News | హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాశ్ భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. ట్రాఫిక్ ఈ-చలానాల రూపంలో ఏపీ పోలీసులు వసూలు చేసిన సొమ్ము నుంచి ఏకంగా రూ.36.55 కోట్లను తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నాడు. దీంతో అవినాశ్‌తోపాటు ఆయన కంపెనీ ‘డాటా ఎవాల్వ్’కు చెందిన ఆస్తుల క్రయవిక్రయాలను నిలిపివేయాలని గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాశారు.
ఏపీలో ట్రాఫిక్ పోలీసులు వసూలు చేసే జరిమానా సొమ్మును 4 పేమెంట్ గేట్‌వేల ద్వారా నేరుగా డీజీపీ ఖాతాలో జమ చేస్తారు. వాటిలో ‘డాటా ఎవాల్వ్’కు చెందిన ‘రేజర్ పే’ గేట్‌వే ఒకటి. దీని నుంచి వెళ్లే సొమ్ము నేరుగా డీజీపీ ఖాతాలో జమ కాకుండా ఉండేలా ఆ యాప్‌ను క్లోనింగ్ చేశారు. ‘రేజర్ పే’ బదులుగా ‘రేజర్ పేఈ’ అనే యాప్‌ను రూపొందించారు. దీని ద్వారా గత ఐదేండ్లలో వసూలైన రూ.100 కోట్లకుపైగా జరిమానాలో రూ.36.55 కోట్లు నొక్కేసిన అవినాశ్.. మిగిలిన సొమ్మును ఎవరికీ అనుమానం రాకుండా డీజీపీ ఖాతాలో జమ చేసినట్టు తేలింది. 2017 జూన్ 27న అప్పటి ఏపీ డీజీపీ సాంబశివరావు ‘డాటా ఎవాల్వ్’కు ఈ-చలానాల సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతలను అప్పగించారు. ఆ సంస్థ కేవలం రూ.1కే కోట్ చేయడంతో కాంట్రాక్టు ఇచ్చినట్టు అప్పట్లో పేరొన్నారు.
స్కాం బయటపడింది ఇలా..
తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ నర్సప్ప తన యూనిట్ నుంచి రోజూ ఎంత మొత్తం వసూ లు అవుతున్నదన్న విషయంపై ఆరా తీశారు. ఈ క్రమంలో మొదటి రోజు చూసిన మొత్తానికి, 4 రోజుల తర్వాత చూసిన మొత్తానికి తేడా కనిపించింది. అనంతరం ఈ ఏడాది మే 1 నుంచి 20 వరకు జరిగిన అన్ని లావాదేవీల్లో తేడా ఉన్నట్టు గమనించడంతో డీఎస్పీ నర్సప్ప ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే అంతర్గత విచారణ జరపడంతో కుంభకోణం బయటపడింది.
అవినాశ్ కుటుంబసభ్యుల కోసం గాలింపు
ఈ కుంభకోణంలో ‘డాటా ఎవాల్వ్’ సంస్థకు చెందిన కొత్తపల్లి రాజశేఖర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కీలక నిందితుడైన అవినాశ్ పరారీలో ఉన్నట్టు పేరొన్నారు. ‘డాటా ఎవాల్వ్’లో డైరెక్టర్‌గా ఉన్న అవినాశ్ సోదరి అక్షిత, రవికిరణ్ కూడా ఈ కేసులో భాగస్వామ్యులుగా ఉన్నారని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. క్లోనింగ్ యాప్ ద్వారా మళ్లించిన సొమ్ము ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్లిందనే విషయంపై విచారణ జరుగుతున్నదని పోలీసులు తెలిపారు.