Kaynes | హైదరాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): తెలంగాణలో కేన్స్ సెమీ కండక్టర్ల ఓఎస్ఏటీ (ఔట్ సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్)కి తయారీ పరిశ్రమ లేనట్టేనని తేలిపోయింది. దానికి బదులు అధునాతన ఈఎంఎస్ (ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్) తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కేన్స్ సీఈవో రఘు పనిక్కర్ స్పష్టంచేశారు. తాజాగా ‘డిజీటైమ్స్ ఏషియా’ పత్రికతో ఆయన మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. పెట్టుబడి స్వభావం మారిందని, ఈ మేరకు ఈఎంఎస్ తయరీ మొదటి దశను ఇప్పటికే ప్రారంభించినట్టు పనిక్కర్ చెప్పారు. కొంగరకలాన్ ప్లాంట్‌లో 3,000 మందికి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చా రు. ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)లో భాగంగా దేశంలో ఒకే ప్రాంతంలో సెమీ కండక్టర్ల ఎకోసిస్టంను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందని, ఇందులో భాగంగా టాటా, మైక్రాన్ వంటి కంపెనీలు గుజరాత్‌లోనే సెమీ కండక్టర్ల ప్లాంట్లను నెలకొల్పాయని చెప్పారు. ఇదే వరుసలో తాము కూడా గుజరాత్లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు తేల్చిచెప్పారు.
నాడు ‘కేన్స్’ను ఒప్పించిన బీఆర్ఎస్ సర్కార్
చైనా, తైవాన్, దక్షిణ కొరియా తదితర దేశాలు నేడు సెమీ కండక్టర్ల రంగంలో ఎంతో రాణిస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మన దేశంలో సెమీ కండక్టర్లకు హైదరాబాద్‌ను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు మన రాష్ట్రంలో సెమీ కండక్టర్లు తయారు చేసే విధంగా ఆనాడే కేన్స్ కంపెనీని ఒప్పించింది. వారు అడిగిందే తడవుగా కొంగరకలాన్‌లో భూములు కూడా కేటాయించింది. సెమీ కండక్టర్ల ఓఎస్ఏటీ ఏర్పాటునకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడమే కాకుండా వెంటనే పరిశ్రమ నిర్మాణ పనులు కూడా నిరుడే ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కేన్స్ సంస్థ తమ ప్రతిపాదనను మార్చుకున్నది. దీంతో ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన సెమీకండక్టర్ల ఓఎస్ఏటీని గుజరాత్ రాష్ర్టానికి మార్చింది.