హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పేద మహిళల ఆర్థిక సాధికారత కోసం ఏర్పడిన స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ప్రస్తుతం నిబంధనల ఉల్లంఘనకు అడ్డాగా మారినట్టు తెలుస్తున్నది. స్త్రీనిధి సంస్థలో రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న ఓ ఉన్నతాధికారి ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొకి తన సొంత ఎజెండాను అమలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ అధికారి తాను వెళ్లేలోపు తన బంధువులు, అనుచరులు, మంత్రి అనుయాయులకు భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలను కట్టబెట్టేందుకు నోటిఫికేషన్ జారీచేసినట్టు విమర్శలు వస్తున్నాయి. స్త్రీనిధిలో ఆరేండ్లుగా ఖాళీలు నింపని అధికారులు.. తీరా ఆ ఉన్నతాధికారి పదవీకాలం ముగిసే సమయంలో హడావుడిగా, నిబంధనలు పాటించకుండా నోటిఫికేషన్ ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 29న 20 పోస్టుల భర్తీకి స్త్రీనిధి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 20న దరఖాస్తులకు గడువు తేదీగా నిర్ణయించింది. ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఉద్యోగాల భర్తీ జరుగాలంటే ఆర్థికశాఖ అనుమతి తప్పనిసరి. కానీ, స్త్రీనిధిలో జరుగుతున్న తాజా రిక్రూట్మెంట్లో కనీస నిబంధనలు పాటించలేదు. రాజ్యాంగం కల్పించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను (రోస్టర్ పాయింట్స్) పూర్తిగా విస్మరించారు. ఎవరికి ఎన్ని పోస్టులు కేటాయిస్తున్నారో స్పష్టత లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. జీవో నంబర్ ఎంఎస్ 275 (1995) ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్కు, జీవో ఆర్టీ 4271 (2008) ప్రకారం కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ నియామకాలకు ఆర్థికశాఖ ముందస్తు అనుమతి ఉండాలి. కానీ ఇకడ అవేవీ లేవు. గత కొన్నేండ్లు ఎలాంటి ఉద్యోగానికైనా రాత పరీక్ష తప్పనిసరి చేశారు. పైరవీలకు తావు లేకుండా పాదర్శకంగా ఉండటానికి ఇంటర్వ్యూలను ఎత్తివేశారు. కానీ, స్త్రీనిధి ఇటీవల ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లో కనీసం రాత పరీక్ష నిర్వహించకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా కన్సల్టెంట్లను భర్తీ చేయాలని నిర్ణయించడం వెనుక తమవారికి పోస్టింగులు ఇప్పించుకోవాలనే కుట్ర దాగి ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి.
స్త్రీనిధి వెబ్సైట్ ద్వారా విడుదల చేసిన నోటిఫికేషన్లో జీతాల లెకలు చూసి నిరుద్యోగులు షాక్‌కు గురవుతున్నారు. గ్రామీణ మహిళలు ప్రతి రూపాయినీ పొదుపుగా కూడబెట్టుకున్న సొమ్ముతో నడిచే స్త్రీనిధిలో వేతనాల రూపంలో లక్ష రూపాయలు పంచుకోవడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. సీనియర్ ఐటీ కన్సల్టెంట్‌కు నెల వేతనం రూ. 2,25,000, టీమ్ లీడర్ రిసెర్చ్‌కు రూ. 2,25,000, జనరల్ మేనేజర్‌కు రూ.2,00,000, అసోసియేట్ రిసోర్స్ కన్సల్టెంట్ రూ.1,50,000గా వేతనాలు నిర్ణయించారు. ఇలా వేతనాలతోపాటు ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు. మల్టీనేషనల్ కంపెనీల కంటే అధికంగా వేతనాలు నిర్ణయించడం వెనుక తమ అనుయాయులుకు, అనుచరులకు లబ్ధి చేకూర్చాలన్న కుయుక్తి కనిపిస్తున్నది. పేద మహిళల పొదుపు సొమ్మును, కష్టపడి సంపాదించిన రూపాయిని ఇలా తమవారికి లక్షల్లో జీతాలుగా పంచడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. గతంలో కన్సల్టెంట్లుగా చేరిన తొమ్మిది మందిని గత ఏడాది ఒకేసారి రెగ్యులర్ చేయడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. ఒకేసారి 50 మందిని కన్సల్టెంట్లుగా తీసుకుంటే గత ఏడాది ఏప్రిల్‌లో 9 మందిని మాత్రమే రెగ్యులర్ చేయడం వెనుక ఉన్న రహస్యం నేటికీ బయటపడలేదు.
‘1964 కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం సంస్థ ఏర్పడిన 45 రోజుల్లోనే క్యాడర్ పే సేలు అమలు చేయాలి. కానీ, 14 ఏండ్లు గడిచినా స్త్రీనిధిలో ఉద్యోగులకు ప్రమోషన్లు లేవు.. పే సేలు లేదు. ఓ ఉన్నతాధికారి నిబంధనలకు విరుద్ధంగా 14 ఏండ్లుగా ఉద్యోగంలో కొనసాగుతూ, కిందిస్థాయి ఉద్యోగులకు రావాల్సిన 70 శాతం ప్రమోషన్ కోటాను అడ్డుకుంటున్నారు’ అని స్త్రీనిధి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి నాగపూర్ రాము ఆరోపించారు. 100 శాతం నియామకాలను బయటి వ్యక్తుల (కన్సల్టెన్సీ) ద్వారా భర్తీ చేయడం నిరుద్యోగులకు, ప్రస్తుత ఉద్యోగులకు చేస్తున్న ద్రోహమని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి, రోస్టర్ లేకుండా జారీచేసిన ఈ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ముఖ్యంగా పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఈ అరాచకాలను అడ్డుకోవాలని, పారదర్శకమైన పద్ధతిలో భర్తీ ప్రక్రియ చేపట్టాలని కోరారు.