ఉద్యోగాల శోధన, నియామకాల్లో హైదరాబాద్ దేశంలోని మూడు ప్రథమ నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఎక్కువమంది ఉద్యోగాన్వేషకులు హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాలనే ఎంచుకుంటున్నారు. పూణే, చెన్నయ్ నగరాలకు ఆ తరువాత ప్రాధాన్యతనిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటలైజేషన్, ఆటోమేషన్, లాక్డౌన్ తదితర సవాళ్లు ఉన్నప్పటికీ హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలు ఉద్యోగాల శోధకులు, నియామకాల్లో అగ్రశ్రేణిలో నిలవడం విశేషం. పూణే, చెన్నయ్ నగరాలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభను ఆకర్షించే నియామకాలు, ఉద్యోగ శోధనలకు కేంద్రాలుగా ఉంటున్నాయి. ఉద్యోగాల విషయంలో కరోనా అనంతర పరిణామాలు, అభ్యర్థుల ఆసక్తిపై డిసెంబర్ 2020- డిసెంబర్ 2021 మధ్య వివరాలను ఇండీడ్ జాబ్ సైట్ బుధవారం వెల్లడించింది.
కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభం, నిరాశ, నిరీక్షణ అనంతరం దేశం దాదాపు సాధారణ స్థితికి చేరుకున్నట్లు ఉద్యోగాన్వేషకులు, నియామకాలనుబట్టి స్పష్టమవుతున్నది. అయితే కరోనా అనంతరం భారతదేశ నియామక కార్యకలాపాల్లో ఆసక్తికరమైన పోకడలు కనిపించినట్లు ఇండీడ్ తెలిపింది. ఇండీడ్ జాబ్ సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొవిడ్ ఫస్ట్, సెకెండ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో వ్యాపారాలు స్థిరపడి తమ కార్యకలాపాలను విస్తరించాయి. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అనేక పరిశ్రమలు వేగవంతమైన వృద్ధిని సాధించడమే కాకుండా ఉద్యోగావకాశాలను సృష్టించాయి.
వ్యాపారాల డిజిటలైజేషన్ టెక్ ఉద్యోగాల డిమాండ్‌ను స్థిరంగా ఉంచినప్పటికీ అనేక ఇతర ఉద్యోగాలు కూడా వృద్ధి సాధించాయి. ముఖ్యంగా ప్రొఫెసర్, లోన్ ఆఫీసర్లు, రిక్రూట్మెంట్ మేనేజర్లు, ప్యాకేజర్లు తదితర ఉద్యోగాలకు ఎక్కువగా డిమాండ్ ఏర్పడింది. డిసెంబర్ 2020-డిసెంబర్ 2021 మధ్య ప్రొఫెసర్ నియామకాలు పెరిగినట్లు డేటా సూచిస్తున్నది. అలాగే ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం శోధించినవారి సంఖ్య కూడా పెరిగినట్లు తేలింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) రంగానికి కూడా ప్రయోజనం చేకూర్చినట్లు వెల్లడైంది. క్రెడిట్ మేనేజర్, లోన్ ఆఫీసర్, బ్రాంచ్ మేనేజర్ తదితర ఉద్యోగాల నియామకాల్లో వృద్ధి నమోదైంది. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఫుల్ స్టాక్ డెవలపర్ తదితర టెక్ ఉద్యోగాల నియామకాలు కూడా స్థిరమైన వృద్ధిని సాధించాయి.
కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన తరువాత కంపెనీలు, ఉద్యోగులు మునుపటి సంవత్సరంతో పోల్చుకుంటే మహమ్మారి ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఈవెంట్ కోఆర్డినేటర్, ప్రెజెంటర్, ట్యాక్సీ డ్రైవర్, కస్టమర్ సర్వీస్ సూపర్వైజర్ తదితర ఉద్యోగాలకోసం ఆసక్తి పెరగడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రజలు మహమ్మారిని దాటి సాధారణ స్థితికి చేరుకున్నట్లు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదే సందర్భంలో కొన్నిరకాల ఉద్యోగ నియామకాలు భారీగా తగ్గాయి. డిసెంబర్-2020-డిసెంబర్ 2021 మధ్య ఆర్డర్ ప్రాసెసర్(-70శాతం), కాల్ సెంటర్ రిప్రజెంటేటివ్(-61శాతం), కలెక్షన్ ఏజెంట్(-52శాతం), మిషిన్ ఆపరేటర్(-59శాతం) నియామకాలు క్షీణించాయి. అలాగే, గ్రౌండ్ స్టాఫ్(-94శాతం), హార్టికల్చర్ మేనేజర్(-80శాతం), ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్(-75శాతం), ఫ్లోర్ సూపర్వైజర్(-71శాతం), మెటీరియల్ మేనేజర్(-71శాతం) నియామకాల్లో కూడా తగ్గుదల కనిపించింది.
టెక్నాలజీ సంస్థలు ఫ్రెషర్స్ నియామకాలు పెంచాయి. ఉద్యోగాలు శోధిస్తున్న ఫ్రెషర్స్ సంఖ్య అక్టోబర్ 2020 అక్టోబర్ 2021మధ్య 30శాతం పెరిగింది. ఎక్కువశాతం మంది సేల్స్ రిప్రజెంటేటివ్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకన్నా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఫుల్ స్టాక్ డెవలపర్స్ వంటి వర్క్ పోర్ట్‌ఫోలియోల కోసం ఉత్సాహం కనబర్చినట్లు వెల్లడైంది.