హైదరాబాద్ : తెలంగాణలోని ఉద్యోగుల ఆరోగ్య పథకం(EHS) అమలు కోసం ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (EHCT) ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, పెన్షనర్ల ప్రతినిధులతో కూడిన ట్రస్టీల పేర్లను వెల్లడించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు మరో 16 మంది ఆయా శాఖలకు చెందిన చీఫ్ సెక్రటరీ, సెక్రటరీలు సభ్యులుగా కొనసాగుతారని స్పష్టం చేసింది. వీరితో పాటు మరో 10 మంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులను, మరో ముగ్గురిని పెన్షనర్ల ప్రతినిధుల పేర్లను ప్రకటించింది.
ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్లో టీఎన్జీవోస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు, టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు చావ రవి ట్రస్టీలో సభ్యులుగా ఉన్నారు. టీజీ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు గిరి శ్రీనివాస్ రెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు సదానందం గౌడ్, ట్రెసా అధ్యక్షుడు వి రవీందర్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ లచ్చిరెడ్డి, ఎస్టీఎఫ్ అధ్యక్షులు సైదులు, తెలంగాణ క్లాస్ ఫోర్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ దాస్య నాయక్ సభ్యులుగా ఉన్నారు.
అదేవిధంగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు పి వెంకట్రెడ్డి, తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పెన్షన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి, తెలంగాణ ఉమెన్ పెన్షనర్స్ అసోసియేషన్ చైర్పర్సన్ ఆర్ ఉమాదేవిని సభ్యులుగా ఉంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ప్రకటనలో వెల్లడించారు.
ఇప్పటివరకు జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని, ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రతిపాదించేందుకు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అదనంగా, ఉద్యోగుల ఆరోగ్య కార్డుల జారీకి సంబంధించిన విధానాలను కూడా ట్రస్ట్ ప్రతిపాదించాలని సూచించారు.