ఇదిగో రాజీనామా… అదిగో రాజీనామంటూ ఏడాదిన్నర నుంచి ఊరిస్తున్న జగ్గారెడ్డి కథ చివరికి నాన్నా పులి వచ్చేలా తయారైంది. పార్టీ అధిష్టానం కూడా ఆయన్ను లైట్‌గా తీసుకుంది. రాహుల్‌గాంధీతో భేటీకి టీపీసీసీ బాధ్యులు, ఇంచార్జీలను ఆహ్వానించినప్పటికీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జగ్గారెడ్డికి పిలుపు రాలేదు. తానేంటో చూపిస్తానని విసిరిన సవాలుకు ఈ రకంగా షాక్ తగిలేటప్పటికీ జగ్గారెడ్డి అండ్ కో విలవిలలాడుతున్నది. ‘ఆగే బడో హమ్ ఆపకే సాత్ హై’ అని ఇంతకాలంగా మద్దతు ఇచ్చిన నాయకులు కూడా ఇప్పుడు ముఖం చాటేయడం, మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పించడంతో ‘అయ్యయో.. అయ్య యో.. ఉన్నది కాస్తా ఊడింది.. సర్వ మంగళం పాడింది’ అని జగ్గన్న తన ఫోన్‌కు రింగ్ టోన్ పెట్టుకొని తిరుగుతున్నట్టు గాంధీభవన్‌లో జోకులేసుకుంటున్నారు.