హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): మాదక ద్రవ్యాలు విక్రయిస్తే ఎంతటివారైనా వదిలిపెట్టబోమని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. పద్ధతి మార్చుకోనివారిపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ను నిరోధించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. మత్తు మహమ్మారిని కూ కటివేళ్లతో పెకిళించే పని మొదలైందని చెప్పారు.
శనివారం టూరిజం ప్లాజా హోటల్లో హైదరాబాద్‌లోని పబ్‌ల యాజమానులు, ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులతో శ్రీనివాస్‌గౌడ్ సమావేశం నిర్వహించారు. డబ్బుకు కక్కుర్తిపడి కొందరు చీడపురుగులు చేస్తున్న పనులతో హైదరాబాద్ నగరానికి, రాష్ర్టానికి చెడ్డపేరు వస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో ఏ పబ్బులోనైనా మత్తు పదార్థాలు, డ్రగ్స్ లభిస్తే వాటి లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దుచేసి కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
డ్రగ్స్‌తో పట్టుబడిన వారు ఎంతటివారైనా వదలొద్దని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ‘అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతున్న హైదరాబాద్‌కు దేశ, విదేశాల నుంచి వచ్చేవారు సైతం వారి కల్చర్‌కు తగ్గట్టుగా ఉండాలన్న బ్రాండ్ నేమ్ కోసమే పబ్బులను అనుమతిస్తున్నాం. కానీ, కొందరు చీడపురుగుల వల్ల మొత్తం రాష్ర్టానికి చెడ్డపేరు వస్తున్నది. నిబంధనల ప్రకారం పబ్బులు, బార్, రెస్టారెంట్లు నడుపుకొంటామం టే ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం ఉంటది. డ్రగ్స్, ఇతర మత్తు దందాలు చేయాలనుకొంటే తెలంగాణను వదిలి వెళ్లండి.
అక్రమార్కుల ఆటలు ఇక్కడ సాగవు. అవసరమైతే పీడీ చట్టం ప్రయోగిస్తాం’అని స్పష్టంచేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది ఎలాంటి ఆయుధాలు లేకున్నా క్షేత్రస్థాయిలో ఎంతో ధైర్యంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. పబ్‌లు, రెస్టారెంట్, బార్లపై కూడా గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. ప్రతి పబ్‌లోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, వాటిని స్థానిక ఎక్సైజ్ సిబ్బంది వారి మొబైల్ ఫోన్లలో చూసుకొనేలా ఏర్పాటు చేసుకోవాలని ఆ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆదేశించారు. 24 గంటల పర్మిషన్ ఉన్న పబ్‌లలో రాత్రి 12 గంటల వరకు ఈవెంట్స్‌కు అనుమతి ఉంటుందని, ఆ తర్వాత ఆహారం, లిక్కర్ మాత్రమే సర్వ్ చేయాలని సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు.
రాష్ట్రంలో మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని తుదముట్టించడంలో ఎక్సైజ్‌శాఖ దూకు డు పెంచింది. ఎన్డీపీఎస్ యాక్ట్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్) కింద ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 4 వరకు 192 కేసులు నమోదుచేసింది. 304 మందిని అరెస్టు చేసి, మ రో 509 మందిని బైండోవర్ చేశారు. 75 వాహనాలు సీజ్ చేశారు. అనధికారికంగా మద్యం అమ్మకం, ఎమ్మార్పీకి మించి ధరలకు అమ్ముతున్నవారిపై రెండు నెలల్లో 298 కేసులు, 102 మందిని అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. కల్తీ మద్యం తయారీ, విక్రయానికి సంబంధించి 59 కేసులు నమోదుకాగా, 78 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు.