సిటీబ్యూరో, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): ఇతడి పేరు శివయ్య. అతడి చేతిలో ఉన్న నాలుగు ముక్కలు ఆయన డ్రైవింగ్ లైసెన్స్. అదేంటి అనుకుంటున్నారా? ఖైరతాబాద్‌కు చెందిన శివయ్య తన ద్విచక్రవాహనంపై మాదాపూర్‌లో రాంగ్రూట్లో వెళ్లాడు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆయన వాహనాన్ని ఆపి లైసెన్స్ తీసుకుని సీజ్ చేశారు. 3 నెలల తరువాత ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని చెప్పారు. శివయ్య ఏకంగా 9 నెలలకు తరువాత ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాడు. పోలీసులు ఇచ్చిన సీజ్ లెటర్‌ను ఆర్టీఏ అధికారులకు చూపగా వాళ్లు అతడి లైసెన్స్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి చూశారు. అందులో లైసెన్స్ నాలుగు ముక్కలుగా ఉంది. దీనిని చూసి ఆర్టీఏ సిబ్బంది, వాహనదారుడు ఖంగుతిన్నారు. తన లైసెన్స్‌ను ట్రాఫిక్ సీఐ విరిచేసి ఉంటాడని, వాహనం ఆపి తనతో అమర్యాదగా మాట్లాడినప్పుడే సందేహం కలిగిందని బాధితుడు శివయ్య చెప్పారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు.