
బొల్లారం, డిసెంబర్ 10 : సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలోని తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు ఇటీవల జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చారు. ఇందులో ఆరుగురు విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం విశేషం. గత నెలలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాఠశాల విద్యార్థులు అసమాన ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.
పోటీలకు ఎంపికైన విద్యార్థులు వీరే…
‘టగ్ ఆఫ్ వార్’ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన మోడల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు టి.అక్షయ్, పి.ఈశ్వర్ తొమ్మిదో తరగతి చదువుతుండగా, ఎం.గీతిక ఇంటర్ మొదటి సంవత్సరం, జి.హారిక, మమత లహరి, నిషాకుమారి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరు జాతీయస్థాయి పోటీలకు శిక్షణ తీసుకుని బరిలోకి దిగారు. పాఠశాల ప్రిన్సిపాల్ శైలజ పర్యవేక్షణలో క్రీడాకారులను తీర్చిదిద్దారు. నవంబర్ 23 నుంచి 28వ తేదీ వరకు మహారాష్ట్రలో జరిగిన 2021వ జాతీయస్థాయి ‘టగ్ ఆఫ్ వార్’ అండర్ 17 విభాగంలో పాల్గొన్నారు. మొత్తంగా సీనియర్ విభాగంలో జె. ఎబినైజర్ గోల్డ్‌మెడల్, అండర్ -19 విభాగంలో హేమంత్‌కుమార్ (సిల్వర్), టి. శిశిధర్ (కాంస్యం), అండర్-17 విభాగంలో మమతా లహరి (సిల్వర్), గీతిక (సిల్వర్) పతకాలు సాధించారు. అండర్ -15 విభాగంలో పి. ఈశ్వర్ (కాంస్యం), పి. అక్షయ్ (కాంస్యం) పతకాలు సాధించారు.
ఉదయం, సాయంత్రం ప్రత్యేక శిక్షణ..
మోడల్ పాఠశాల పీడీ శశిరేఖ విద్యార్థులకు ఆటపై ప్రత్యేక శిక్షణ ఇస్తూ మెళకువలు నేర్పుతున్నారు. ఉదయం, సాయంత్రం వ్యాయామ శిక్షణ ఇస్తూ ఆటపై ఆసక్తిని పెంచుతున్నారు. టగ్ ఆఫ్ వార్ ఆట పరంగా విద్యార్థులను ధృఢంగా తయారుచేస్తున్నారు.
‘టగ్ ఆఫ్ వార్’ క్రీడ ప్రధానాంశాలు…
ఈ ఆటలో మొత్తం 8 మంది ప్రధాన క్రీడాకారులు, ఇద్దరు ఎక్స్ట్రా క్రీడాకారులు ఉంటారు.
వయస్సు, బరువును బట్టి కేటగిరీలో జట్లు నిర్ణయిస్తారు. అండర్ 13, 15, 17, 19 విభాగాల్లో, ఆపై సీనియర్ విభాగాల్లో పాల్గొనేలా క్రీడాకారులను నిర్ణయిస్తారు.మిక్స్డ్ విభాగంలో నలుగురు బాలురు, నలుగురు బాలికలు, ఎక్స్ట్రా ఒక బాలుడు, ఒక బాలిక ఉంటారు.తాడుపై ఇరు జట్లకు ఈ క్రీడ నిర్వహిస్తారు. తాడు చివరన ఉండే క్రీడాకారులను త్రెడ్ లాకర్ అంటారు. వారిపైనే గేమ్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
శిక్షణ తరగతులు..
టగ్ ఆఫ్ వార్ పోటీల కోసం విద్యార్థులకు ఉదయం, సాయంత్రం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వారిలో మనోధైర్యం నింపుతూ పోరాడే తత్వాన్ని అలవర్చుతున్నారు. ముఖ్యంగా బలంగా, ధృడంగా ఉండేందుకు ఆహార నియమాలపై దృష్టి పెడుతున్నారు. ఇంటి వద్ద కూడా పౌష్టికాహారం అందించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. త్రెడ్‌పై బాలికలు, బాలురు సమాన స్థాయిలో శక్తియుక్తులు ప్రదర్శిస్తే విజయం సాధించినట్లేనని వివరిస్తున్నారు.
బలంతో పాటు ఒడుపు ఉండాలి..
తాడు లాగే ఆటలో బలం ఉంటే చాలు అనుకోవడం పొరపాటు. సరైన విధంగా ఒడుపు ఉంటేనే విజయం సొంతమవుతుంది. జాతీయ స్థాయికి ఎంపికయ్యా. తెలంగాణ తరపున ఆడుతుండడం చాలా గర్వంగా ఉంది.
ఆడాలనే మక్కువతోనే నేర్చుకున్నా..
పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడే తాడు లాగే ఆట గురించి విన్నా. ఆట ఆడుతుండగా ఒకసారి చూశా. అప్పటి నుంచి ఆట నేర్చుకోవాలనిపించింది. పీడీ శశిరేఖ మేడం వద్ద సాధన చేశా. అలా సాధన చేయడంతోనే జాతీయస్థాయికి ఎంపికయ్యా. చాలా సంతోషంగా ఉంది.
-పి.ఈశ్వర్, తొమ్మిదో తరగతి విద్యార్థి, బొల్లారం
సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే..
సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని పాఠశాలకు చెందిన విద్యార్థులు నిరూపించారు. మారుమూల ప్రాంతానికి చెందిన విద్యార్థులు టగ్ ఆఫ్ వార్‌పై పట్టుసాధించి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. తొలుత సరదాగా ప్రారంభించిన ఆట ఇప్పుడు జాతీయస్థాయి వరకు వెళ్లింది. సెలవు దినాల్లో విద్యార్థులు నాలుగు గంటలు సాధన చేసేవారు. ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఆటపై దృష్టిసారిస్తున్నారు. మున్ముందు టగ్ ఆఫ్ వార్ ఆటలో రాష్ర్టానికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడం ఖాయం.
-శశిరేఖ, పీడీ, మోడల్ పాఠశాల, బొల్లారం