
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): రెరా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా విక్రయించే వాణిజ్య భవనాలు, ఇండ్ల కొనుగోలుకు, ముందస్తు బుకింగ్లకు డబ్బులు చెల్లించవద్దని మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిశాఖ (ఎంఏయూడీ) ప్రజలకు సూచించింది. ఇటీవలికాలంలో పలువురు బిల్డర్లు ప్రీ సేల్ ఆఫర్ల పేరుతో కనీసం భూమి కూడా కొనుగోలు చేయకుండా, భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకోకుండా సోషల్మీడియాలో, పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. బిల్డర్లు విక్రయించే ప్రతి భవనాన్ని రెరా వద్ద రిజిస్టర్ చేయాల్సిందేనని స్పష్టంచేసింది. ఇండ్లు, వాణిజ్య భవనాల కొనుగోలుపై శుక్రవారం మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రీ సేల్ ఆఫర్ పేరుతో వచ్చే ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. రెరాలో బిల్డర్ రిజిస్టర్ చేసుకోకుంటే వినియోగదారులు చేసే కొనుగోళ్లకు, పెట్టుబడులకు ఎలాంటి రక్ష ణ ఉండదని, ఏదైనా జరిగితే వారికి న్యాయం కోరే అవకాశాన్ని కోల్పోతారని స్పష్టంచేసింది. ఇండ్లను కొనుగోలు చేసే ప్రజలు, సంస్థలు.. రెరా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు ఉన్నాయో లేదో సంబంధిత వెబ్సైట్లలో చూసుకోవాలని సూచించింది.