మా బాబు వయసు రెండేండ్లు. గతేడాది మూడు నాలుగు సార్లు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడల్లా మూడునాలుగు రోజులు ఉండేది. రక్త పరీక్షలు చేయిస్తే.. బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందన్నారు. రిపోర్ట్స్‌లో సీఆర్పీ ఎక్కువగా ఉందని చెప్పారు. వైద్యులు యాంటి బయాటిక్స్ ఇచ్చిన తర్వాత బాబు కోలుకున్నాడు. ఇలా మళ్లీ మళ్లీ బ్లడ్ ఇన్ఫెక్షన్ రావడం ప్రమాదకరమా? సీఆర్పీ పెరిగితే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టా?
మీరు చెప్పిన వివరాల ప్రకారం మీ బాబు ఏడాదిలో మూడు, నాలుగు సార్లు ఇన్ఫెక్షన్కు గురైనట్టుగా కనిపిస్తున్నది. మనకు ఏదైనా ఇన్ఫెక్షన్ తెలెత్తినప్పుడు శరీరం రియాక్ట్ కావడం వల్ల పెరిగే ప్రొటీనే సీఆర్పీ (సీ రియాక్టివ్ ప్రొటీన్). సాధారణంగా బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు సీఆర్పీ పెరుగుతుంది. కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా పెరగవచ్చు. ఇతర కారణాల వల్ల కూడా సీఆర్పీ పెరుగుతుంది. ఉదాహరణకు దెబ్బ తగలడం, ఆపరేషన్ తర్వాత బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఏర్పడినా ఈ పరిస్థితి వస్తుంది. ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తపరుస్తుంది. అంతేకాని సీఆర్పీ పెరిగిన ప్రతిసారీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందనుకోవద్దు. చాలాసార్లు రోగులకు, పేరెంట్స్‌కు అర్థం కావడానికి సీఆర్పీ అధికంగా ఉంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందేమో అని అనుమానం వ్యక్తం చేస్తారు. రక్తంలో బ్యాక్టీరియా ఉన్నప్పుడే దాన్ని ఇన్ఫెక్షన్గా పరిగణించాలి. శరీరంలో వేరే భాగాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా.. సీఆర్పీలో పెరుగుదల కనిపిస్తుంది. ఉదాహరణకు త్రోట్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్, న్యుమోనియా ఉన్నా సీఆర్పీ పెరుగుతుంది. సీఆర్పీ ఎక్కువగా ఉన్నంత మాత్రాన కంగారు పడాల్సిన పనిలేదు. బిడ్డ లక్షణాలు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఛాతీ ఎక్స్ రే ఇవన్నీ గమనించి, పరీక్షల్లో ఉన్న మార్పులను పరిగణించి.. ఇన్ఫెక్షన్ను నిర్ధారించాల్సి ఉంటుంది. వైద్యులు దానికి తగ్గ యాంటి బయాటిక్స్ సూచిస్తారు.
ఒకటి నుంచి ఐదేండ్లలోపు పిల్లల్లో సంవత్సరానికి పది పన్నెండు ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. పిల్లల ఇమ్యూనిటీ పెరిగే క్రమంలో సాధారణంగా జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వీటిలో మెజారిటీ వైరల్ బాపతే ఉంటాయి. మూడునాలుగు రోజుల్లో స్వస్థత చేకూరుతుంది. బిడ్డకు కొద్దిగా జ్వరం ఉన్నా.. హుషారుగా ఉంటే ఇబ్బందేం లేదు. యాంటి బయాటిక్స్ అవసరం కూడా రాకపోవచ్చు. కానీ, మూడు రోజులు దాటి జ్వరం కొనసాగినా, తీవ్రత అధికంగా ఉన్నా.. పీడియాట్రీషియన్‌ను సంప్రదించాలి. వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదీ లేదని నిర్ధారించుకోవడం కోసం అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఇక, మీ బాబు విషయంలో.. ఎత్తు, బరువు గురించి ప్రస్తావించలేదు. మిగతా అన్నీ బాగానే ఉంటే.. మూడు, నాలుగుసార్లు సీఆర్పీ పెరిగినంత మాత్రాన ఇబ్బందేం ఉండదు. పీడియాట్రీషియన్ సలహా మేరకు చికిత్స తీసుకోండి.