మాస్కులు, భౌతిక దూరం, పరిశుభ్రతే శ్రీరామ రక్ష
నిర్లక్ష్యం వహిస్తే కరోనా సామాజిక వ్యాప్తి ప్రమాదం
ప్రముఖ ఫార్మకాలజీ శాస్త్రవేత్త డాక్టర్ రఘురామ్‌రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు, వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు జారీచేసిన మార్గదర్శకాలను పాటించకుంటే సామాజిక వ్యాప్తికి దారితీసే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. కరోనా టీకా తీసుకున్నాం కదా.. ఏమీకాదులే అన్న ధోరణి విడనాడాలని పేర్కొంటున్నారు. టీకా తీసుకున్నా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ ముప్పు పొంచి ఉంటుందని వైద్యనిపుణులు చెప్తున్నారు.
టీకాలు వైరస్ తీవ్రతను మాత్రమే తగ్గిస్తాయని, వందశాతం అడ్డుకోలేవని వాటిని అభివృద్ధి చేసిన కంపెనీలే చెప్పాయని పేర్కొంటున్నారు. టీకా రెండు డోసులు తీసుకున్న 28 రోజుల తర్వాతే శరీరంలో రోగనిరోధక శక్తి ఏర్పడుతుందని, అది కేవలం 60 నుంచి 80 శాతం మాత్రమే రక్షణ ఇస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ, ముఖానికి మాస్కులు ధరించటం, భౌతికదూరం పాటించినప్పుడే మహమ్మారినుంచి వందశాతం రక్షణ లభిస్తుందని స్పష్టంచేస్తున్నారు.
ఎండల ప్రభావం తక్కువే
ఎండాకాలంలో అధిక ఉష్ణాగ్రతల వద్ద కూడా కరోనావైరస్ విజృంభిస్తున్నదని వైద్యనిపుణులు తెలిపారు. గతేడాది మార్చిలో మొదలైన కరోనా కేసులు ఏప్రిల్ నుంచి భారీగా పెరిగి మే నాటికి పీక్ స్టేజ్‌కి చేరాయని గుర్తుచేస్తున్నారు. కరోనా వైరస్‌పై వాతావరణ పరిస్థితుల ప్రభావం పెద్దగా కనిపించడంలేదని అభిప్రాయపడుతున్నారు. ఉత్పరివర్తనాల కారణంగా వైరస్ వేగంగా వ్యాపిస్తున్నది. గతేడాది చివరలో తగ్గుముఖం పట్టిన కరోనా, కొంతమంది నిర్లక్ష్యం కారణంగా మళ్లీ వేగంగా వ్యాపిస్తున్నది. దాంతో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకొంటేనే ఈ మహమ్మారిని అరికట్టగలమని పేర్కొంటున్నారు.
మాస్కులు, భౌతిక దూరమే శ్రీరామ రక్ష
వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నది. ప్రజలు ఇప్పటికైనా మేలుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత అధికమయ్యే అవకాశాలున్నాయి. టీకా తీసుకున్నా నియమాలు పాటించటం తప్పనిసరి. మరికొన్ని రోజులు సామూహిక కార్యక్రమాలు, పార్టీలు, వేడుకలు, ఊరేగింపులకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంతవరకు వ్యక్తిగత రవాణా సాధనాలను వినియోగించటం మంచిది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడమే శ్రీరామ రక్ష.
-డాక్టర్ రఘురామ్‌రావు, ఫార్మకాలజిస్టు