చాలామందికి పొదుపు, మదుపు మధ్య వ్యత్యాసాలపై అవగాహన తక్కువ. ఈ రెండూ వేర్వేరు లక్ష్యాలతో ఉండే సాధనాలు. వచ్చే సంపాదనలో ఆదాచేసే మొత్తాలను ఎక్కువమంది ఒకే దృష్టిలో చూస్తారు. అయితే కాలానుగుణంగా వీటికి కేటాయించే మొత్తాలు, అలాగే స్వల్ప, మధ్య, దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి నడుమ తేడాలను గుర్తించడం అవసరం.
భవిష్యత్తు అవసరాలు, వ్యయాల కోసం పక్కన పెట్టే మొత్తమే పొదుపు. ఇది సాధారణంగా అత్యవసరాలు, ఆపదల కాలంలో చేతికందుతుంది. మరో మాటలో చెప్పాలంటే అవసరమైనప్పుడు అతిత్వరగా చేతికందే మొత్తాలే పొదుపు. డిపాజిట్లు, నగదు, నగదు సమానమైన సాధనాలు ఈ కోవలోకి వస్తాయి. పొదుపులో లిక్విడిటీ ఎక్కువ. రిస్క్ తక్కువ. అసలు విలువ భద్రంగా ఉంటుంది.
వివిధ ఆర్థిక సాధనాలు, అసెట్లలో దీర్ఘకాలంలో సంపదను సృష్టించడానికి చేసేదే మదుపు. ఇవి సంపదను సృష్టించడంతోపాటు ఆదాయాలను కూడా ఇస్తాయి. ఈ కోవలోకి షేర్లు, రియల్ ఎస్టేట్, బంగారం, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, ఇతర సాధనాలు వస్తాయి. వీటిలో రిస్క్ ఎక్కువ. అలాగే రాబడీ అధికమే. స్వల్ప, మధ్య, దీర్ఘకాలాలకు అనుగుణంగా మదుపు చేయవచ్చు.
ఆదాయంలో కనీసం 10 శాతం స్వల్పకాలిక అవసరాల కోసం లిక్విడిటీ అధికంగా ఉండే సాధానాల్లో పొదుపు చేయాలి. పొదుపు లక్ష్యం ఏదైనాసరే అవసరాల్లో ఆదుకునేదై ఉండాలి. ఉద్యోగం ఊడిపోవడం, మెడికల్ ఎమర్జెన్సీ, ఊహించని వ్యయాలు ఇలా అనేక రకాల ఎమర్జెన్సీల్లో ఓ నిధి అవసరం. ఈ నిధికి మారు పేరే పొదుపు. ఏ ఆదాయం లేకపోయినా కనీసం 6 నుంచి 12 నెలలపాటు ఆదుకోగల అత్యవసర నిధిని ఏర్పాటు చేయండి. మిగిలిన మొత్తాన్ని మదుపు చేయడానికి తరలించండి. మరో రకంగా చెప్పాలంటే పొదుపు తదుపరి అడుగే మదుపు.
మన కలలను సాకారం చేసుకోవడానికి చేసేదే మదుపు. సొంతిల్లు, పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్ ప్లానింగ్లను మదుపుగా చెప్పుకోవచ్చు. ఇవి కాలానుగుణంగా ఉంటే మధ్య, దీర్ఘకాల లక్ష్యాలు. మదుపుపై రాబడి కనీసం సగటు వడ్డీరేటు, ద్రవ్యోల్బణం రేట్లకన్నా అధికంగా ఉండాలి. దీర్ఘకాలంలో ఏటా కనీసం 15 శాతం అంతకన్నా అధిక రాబడినిచ్చే ఆర్థిక సాధనాల్లో మదుపు చేయాలి. ఇంటి కోసం, కారు, రిటైర్మెంట్ ప్లానింగ్‌ల కోసం ఆయా కాలాలకు అనుగుణంగా సాధనాల ఎంపిక జరగాలి. ఈక్వీటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో రాబడి అధికం.
అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా వీటి ఎంపిక, వాటిలో చేసే మొత్తం అధారపడి ఉంటుంది. ఆదాయం, రిస్క్‌ను భరించే శక్తి, ఆర్థిక లక్ష్యాలు వీటిని నిర్దేశిస్తాయి. ఆదాయంలో కనీసం 10 శాతం పొదుపు, 20 శాతానికిపైగా వివిధ దీర్ఘకాల లక్ష్యాల కోసం మదుపు చేయాలి. సాధారణంగా పొదుపు సాధనాలపై ఏటా 4 నుంచి 7 శాతం వరకు రాబడి ఉంటుంది. అదే హైబ్రిడ్ ఫండ్స్‌లో 8 నుంచి 12 శాతం రాబడి ఉంటుంది. ఈక్విటీ ఫండ్లలో దీర్ఘకాలంలో ఏటా సగటున 15 శాతానికిపైగా రాబడిని పొందవచ్చు. ఎంత చిన్న వయసులో మదుపు ప్రారంభిస్తే సంపద అంత వేగంగా వృద్ధి చెందుతుంది. మొదటి రూ.10 లక్షల సంపదే కష్టం. ఆ తర్వాత కాంపౌండింగ్ పద్ధతిలో దాన్ని పెంచడం చాలా సులభం.