Uganda | న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఆఫ్రికా దేశం ‘ఉగాండా’లో అంతుబట్టని వ్యాధి ప్రబలింది. ‘డింగా డింగా’ వైరస్‌గా పేర్కొంటున్న దీనిబారిన పడ్డవాళ్లలో రోగ లక్షణాలు అంతుబట్టని విధంగా ఉంటున్నాయి. డ్యాన్స్ చేస్తున్న మాదిరి రోగి శరీరం తీవ్రస్థాయిలో వణకటంతో ఈ వ్యాధికి ‘డింగా డింగా’ అనే పేరు పెట్టారు. ఉగాండాలోని బుందిబుగియో జిల్లాలో 300మందికిపైగా వైరస్ సోకింది. ఇందులో అత్యధికంగా మహిళలు, బాలికలు ఉండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
రోగుల్లో కొంతమంది పక్షవాతానికి గురవుతున్నారని తెలిసింది. అంతుబట్టని విధంగా ప్రబలుతున్న ఈ వ్యాధిపై ఉగాండా ఆరోగ్యశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వైరస్ కారణంగా మరణాలు నమోదుకాలేదు. రోగులకు యాంటీబయాటిక్స్ ఇస్తూ వైద్యులు చికిత్స చేస్తున్నారని, వారంలోగా రోగులు కోలుకుంటున్నారని జిల్లా వైద్య అధికారి డాక్టర్ కియాతా క్రిస్టోఫర్ చెప్పారు.
1518లో వచ్చిన ‘డ్యాన్సింగ్ ప్లేగు’కు డింగా డింగా వైరస్‌కు దగ్గరి పోలికలు ఉన్నాయట. ‘డింగా డింగా’ వైరస్ సోకినవాళ్లలో తీవ్రమైన జ్వరం, శరీరం తీవ్రంగా వణకటం, ఎటూ కదల్లేని నిస్సత్తువ మొదలైన లక్షణాలు ఉన్నాయి. కొంతమందిలో పరిస్థితి తీవ్రస్థాయికి చేరుకోగా.. పక్షవాతం బారిన పడ్డారని ఓ వార్తా ఏజెన్సీ తెలిపింది.