ప్రయాణాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకున్నప్పుడే గమ్యాన్ని చేరుకోగలమని అంటోంది చెన్నై సొగసరి రెజీనా. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో విభిన్నమైన కథాంశాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నది. కమర్షియల్ సినిమాలతో పోలిస్తే ప్రయోగంగా భావించి చేసిన పాత్రలు నటిగా తనకు ఎక్కువగా సంతోషాన్నిస్తున్నాయని అంటోంది. రెజీనా మాట్లాడుతూ ‘ఆరేళ్ల వయసులోనే నటనపై ఇష్టం ఏర్పడింది. సినిమాల్లోకి రావాలని అప్పుడే బలంగా నిర్ణయించుకున్నా. ఆ కలల సాధన కోసం సరైన ప్రణాళికల్ని నిర్దేశించుకుంటూ ముందుకు సాగాను. వాణిజ్య ప్రధాన సినిమాలతో కెరీర్ ఆరంభంలో మంచి విజయాలు దక్కాయి.
దక్షిణాది నంబర్‌వన్ నాయికల్లో నేను ఒకరినంటూ వచ్చిన ప్రశంసలతో ఆనందపడ్డా. ‘సౌఖ్యం’తో పాటు నేను చేసిన కొన్ని సినిమాలు పరాజయం పాలవ్వడంతో కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది.చాలా రోజులు ఒక్క అవకాశం కూడా రాలేదు. మళ్లీ నటించలేనేమోనని భయపడ్డా. కొన్నాళ్లు సినిమాలకు విరామం తీసుకొని ఎటువైపు అడుగులు వేయాలో ఆలోచించుకున్నా. కమర్షియల్ సినిమాలతో దూరంగా ఉంటూ కొత్తదారుల్లో ప్రయాణించడమే మంచిదనిపించింది. ఆ నిర్ణయమే నా జీవితాన్ని మార్చింది’ అని తెలిపింది.