Dhruv Vikram | తమిళ సినీ పరిశ్రమలో యువ నటుడిగా గుర్తింపు పొందిన ధ్రువ్ విక్రమ్ ఇప్పుడు నేరుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నారు. స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ధ్రువ్, తన నటనతో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమవుతూ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే తమిళంలో ‘మహాన్’, ‘బైసన్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ధ్రువ్ విక్రమ్, తన తదుపరి అడుగును తెలుగులో వేయబోతుండటం ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రూపొందనున్న ఈ సినిమా రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కనుందని సమాచారం.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నది షార్ట్ ఫిల్మ్ ‘మనసానమహ’తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు దీపక్ రెడ్డి. కొత్త తరహా ప్రేమకథతో వినోదాన్ని మిళితం చేసే కథను సిద్ధం చేసిన ఆయనకు ధ్రువ్ విక్రమ్ వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించే ప్లాన్ ఉన్నట్లు సమాచారం. సంగీత దర్శకుడిగా యువ టాలెంట్ సాయి అభ్యంకర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రొమాంటిక్ కామెడీకి తగినట్లుగా మ్యూజిక్ కూడా ప్రధాన ఆకర్షణగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
చాలా కాలంగా పలువురు తెలుగు మేకర్స్ ధ్రువ్ విక్రమ్‌ను టాలీవుడ్లోకి తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ, చివరకు మైత్రీ మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్‌ను సెట్ చేయడం విశేషంగా మారింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తండ్రి చియాన్ విక్రమ్ లాగే విభిన్న పాత్రలతో గుర్తింపు పొందిన ధ్రువ్ విక్రమ్, తెలుగులో కూడా తనదైన ముద్ర వేస్తాడనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. టాలీవుడ్ ప్రేక్షకులు కొత్త హీరో ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.