నటీనటులు: శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు
దర్శకత్వం: మురళీకాంత్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని
మ్యూజిక్: మార్క్ కె.రాబిన్
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖా బొగ్గారపు
బ్యానర్: లౌక్య ఎంటర్టైన్మెంట్స్
రిలీజ్ డేట్: 2025-12-25
తెలంగాణ పల్లెటూరి నేపథ్యం, కుల వివక్ష వంటి సున్నితమైన సామాజిక అంశంతో తెరకెక్కిన ‘దండోరా’ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై, విడుదలకి ముందు నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి. మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.
కథ
తెలంగాణలోని తుళ్లూరు అనే గ్రామం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరిలో కుల వివక్ష వేళ్లూనుకుపోయి ఉంటుంది. ఎంతలా అంటే, తక్కువ కులానికి చెందిన వారు మరణిస్తే వారి అంత్యక్రియలు కూడా ఊరికి దూరంగా, ఎవరికీ కనిపించని చోట నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అగ్ర కులానికి చెందిన రైతు శివాజీ (శివాజీ) హఠాత్తుగా మరణిస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన శవాన్ని అగ్రకుల స్మశాన వాటికలో దహనం చేయడానికి వీల్లేదని ఆ కుల పెద్దలు అడ్డుతగులుతారు. దీంతో తన తండ్రికి గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించాలని కొడుకు విష్ణు (నందు), కూతురు సుజాత (మనికా చిక్కాల), ఊరి సర్పంచ్ (నవదీప్) కలిసి పోరాటం మొదలుపెడతారు. అయితే సొంత కులమే శివాజీని ఎందుకు వెలివేసింది? తక్కువ కులానికి చెందిన రవి (రవికృష్ణ) హత్యకు, ఈ కుల రాజకీయాలకు సంబంధం ఏంటి? వేశ్య శ్రీలత (బిందుమాధవి) పాత్ర శివాజీ జీవితాన్ని ఎలా మార్చింది? చివరికి శివాజీ అంత్యక్రియలు సజావుగా సాగాయా లేదా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ
కులం చుట్టూ తిరిగే కథలు తెలుగు తెరపై కొత్తేమీ కాదు. అగ్ర కులాలు, తక్కువ కులాల మధ్య ఉండే అంతరాలు, ప్రేమలు, గొడవలను ఆధారంగా చేసుకుని ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. అయితే దర్శకుడు మురళీకాంత్ ‘దండోరా’ కోసం ఎంచుకున్న పాయింట్ చాలా వైవిధ్యంగా ఉంది. సాధారణంగా సినిమాల్లో నిమ్న కులాల వారే బాధితులుగా కనిపిస్తారు. కానీ, ఈ చిత్రంలో అగ్ర కులాల వారే బాధితులుగా మారడం అనేది ఒక ఆసక్తికరంగా మారింది. ఫస్టాఫ్ కథలోని పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నారు. ప్రారంభంలో కథనం వేగంగా సాగకపోయినా, దర్శకుడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయంలో ప్రేక్షకులకు కాస్త సందిగ్ధత నెలకొంటుంది. సీన్లు అక్కడక్కడే తిరుగుతున్నట్టు, కథ రెగ్యులర్ ఫార్మాట్లో సాగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ, ఇంటర్వెల్ బ్లాక్ దగ్గరకు వచ్చేసరికి సినిమా ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. అప్పటివరకు ఉన్న సందేహాలకు సూటిగా సమాధానం చెబుతూ, కథను అసలైన ట్రాక్‌లోకి ఎక్కించారు. సెకండాఫ్ రెండో భాగంలో కూడా అక్కడక్కడా నెమ్మదించిన భావన కలుగుతుంది. ముఖ్యంగా శివాజీ మరియు బిందుమాధవి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు కథను సాగదీసినట్టు అనిపిస్తాయి. అయితే, ఎప్పుడైతే కోర్టు ఎపిసోడ్ మొదలవుతుందో, అప్పటి నుండి సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. శివాజీ పాత్ర తన నటనతో చెలరేగిపోగా, మిగిలిన పాత్రలు కూడా అంతే ఇంటెన్స్‌గా సాగుతాయి. చివరి అరగంటలో దర్శకుడు పండించిన ఎమోషన్స్ సినిమాకు ప్రాణవాయువుగా నిలిచాయి. హృదయాన్ని కదిలించే సన్నివేశాలు, సమాజాన్ని ఆలోచింపజేసే సంభాషణలతో సినిమాను క్లైమాక్స్ వైపు నడిపించిన తీరు ప్రశంసనీయం. ఎమోషనల్ కంటెంట్ సరిగ్గా కుదరడం వల్ల, సినిమాను సక్సెస్ బాట పట్టించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
నటీనటులు
ఈ సినిమా భారాన్ని తన భుజాలపై మోస్తూ, మరోసారి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో చెలరేగిపోయాడు శివాజీ. తన సీనియారిటీతో సినిమాకు వెన్నెముకగా నిలిచాడు. నవదీప్ 2.0 వెర్షన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటివరకు ఆయనకున్న ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన పాత్రలో ఒదిగిపోయి ఆశ్చర్యపరిచాడు. నందు విషయానికి వస్తే ఈ చిత్రంలో మనం ఒక కొత్త నందుని చూస్తాం. నటుడిగా ఆయనలో ఉన్న మెచ్యురిటీని అద్భుతంగా ప్రదర్శించారు. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ నుండి సినిమా ముగిసే వరకు తన నటనతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నాడు. బిందుమాధవి, మణిక, మౌనిక రెడ్డి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రతి పాత్ర కథలో గుర్తుండిపోయేలా ఉంది.
సాంకేతికంగా
వెంకట్ కెమెరా పనితనం సినిమాకు అదనపు బలాన్నిచ్చింది. తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని సహజంగా బంధించడమే కాకుండా, సన్నివేశాల్లోని ఫీల్‌ను చక్కగా ఎలివేట్ చేశారు. మార్క్ కె రాబిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అది కథలోని ఎమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. సృజన ఎడిటింగ్ బాగున్నా, అక్కడక్కడా ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సిందనిపిస్తుంది. క్రాంతి ప్రియం ఆర్ట్ వర్క్, రేఖా బోగ్గారపు కాస్ట్యూమ్స్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది.
చివరిగా
సామాజిక అసమానతలు, కులం పేరుతో జరిగే అరాచకాలను ఎండగట్టాలనే తపనతో ‘దండోరా’ రూపొందింది. ప్రస్తుత తరం ఆలోచనలకు భిన్నంగా, సమాజానికి కనువిప్పు కలిగించేలా దర్శకుడు మురళీకాంత్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ముఖ్యంగా సినిమా ఓపెనింగ్‌ను, క్లోజింగ్‌ను నవదీప్ పాత్రతో కనెక్ట్ చేసిన విధానం చాలా బాగుంది. చక్కటి కథ, బలమైన సామాజిక సందేశం మరియు నటీనటుల పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే.. ఈ వారం థియేటర్లలో ‘దండోరా’ను నిస్సందేహంగా చూడవచ్చు.
రేటింగ్ : 3/5