‘ఇది మంత్రి నియోజకవర్గమా? లేక టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నారా? అన్నది ఆలోచించమని.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. పదవులు.. ప్రజలు పెట్టే భిక్ష అని.. అధికారంలోకి వచ్చాక మనం ఏం చేశామన్నదే వారు చూస్తారన్నారు. ఇప్పుడు తాము చేస్తున్నది కూడా అదేనని.. ఎన్నికలు ఉన్నాయా లేదా అన్నదాంతో సంబంధం లేకుండా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గంలో రూ.371.10 కోట్ల అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించిన ఆయన.. తెలంగాణ సర్కారు చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూనే.. రాష్ర్టానికి ఏ మాత్రమూ సహకరించని కేంద్రానికి చురకలూ అంటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ పాడిన ‘ఉరుకుతున్న గులాబీ దండు ముందు ఎగురుతున్న జెండా కేసీఆర్… ఆ గులాబీ దండుకు గుండె బలమే మన అన్న కేటీఆర్’ అన్న పాట సభికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
‘ఇది కదా ప్రభుత్వమంటే.. అని ప్రజలే కాదు.. ప్రజాప్రతినిధులుగా మనమూ అనుకున్నప్పుడే నిజమైన ప్రజాసేవకులం అవుతాం. ఈరోజు జరిగిన ఓ సంఘటన నాకు పట్టరాని సంతోషాన్ని ఇస్తోంది. ఎంఐఎం పార్టీకి చెందిన జల్పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాధిక్… ఈ కార్యక్రమానికి వచ్చే ముందు నన్ను కలిశారు. సార్… మా జల్పల్లిలో ఇదివరకు వారం, పది రోజులకోసారి నీళ్లు వచ్చేవి. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన మిషన్ భగీరథ పుణ్యమా అని ఇప్పుడు రోజు విడిచి రోజు మంచినీళ్లు సరఫరా చేస్తున్నారు. నిజంగా మా కష్టాలు తీర్చిన సర్కారు మీది అన్నారు. వేరే పార్టీకి చెందిన ఓ మున్సిపల్ చైర్మన్ ఆ మాట అనగానే నిజంగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
ఇది కదా నిజమైన ప్రభుత్వమంటే అనిపించింది.
‘ప్రతి గడపకు సంక్షేమం.. ప్రతి ఇంటికి అభివృద్ధి’ ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. కష్టపడి సాధించుకున్న తెలంగాణలోని పేదల ముఖాల్లో సంతోషం చూడటం కోసం నిధులు నీళ్లలా ఖర్చు చేస్తున్నాం. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని అప్పట్లో ఓ సినిమా పాట ఉంది. కానీ.. తెలంగాణ వచ్చాక అది మారిపోయింది. సర్కారు దవాఖానకే పోతా… అక్కడే ప్రసూతి చేయించుకుంటాం.. మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ తీసుకుంటాం అంటున్నారు ఇప్పుడు అందరూ.
సీఎం మనుమడు, మనుమరాలు ఏ సన్న బియ్యంతో అన్నం తింటారో అవే బియ్యంతో మధ్నాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాం. 950కి పైగా ఉన్న గురుకులాల్లో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఏటా రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటే. మన ఊరు – మన బడి పథకం కింద రూ.7,289 కోట్లతో 26 వేల పాఠశాలలను అభివృద్ధి చేయబోతున్నాం.
బడంగ్‌పేట, జనవరి 29 (నమస్తేతెలంగాణ) : ‘భారీ వర్షాల వల్ల 2020 అక్టోబర్‌లో నగరం అతలాకుతలమవుతుంటే కేంద్రాన్ని నిధులు ఇవ్వమంటే పైసా కూడా ఇవ్వలేదు. అదే గుజరాత్లో వరదలు వస్తే విమానంలో పోయి వెయ్యికోట్లు ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజల రక్తం, శ్రమతో పన్నుల రూపంలో కేంద్రానికి వేలాదికోట్లు చెల్లిస్తుంటే..తిరిగి రాష్ర్టానికి మాత్రం నిధులు కేటాయించడం లేదు. కేంద్ర బీజేపీ సర్కారు, ఆ పార్టీ ఇక్కడి నాయకులు అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారు. ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరు. విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెబుతారు. అభివృద్ధిలో పోటీపడాలే తప్ప విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేయొద్దు. తప్పుడు ఆరోపణలు, మంత్రుల కాన్వాయ్‌లను అడ్డుకోవడం వంటి చిల్లర రాజకీయాలు మానుకోండి. మహేశ్వరం నియోజకవర్గంలో ఒక్కరోజే రూ.371 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశాం. నియోజకవర్గాన్ని అగ్రభాగాన ఉంచుతాం’ అని పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లు, తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలలో రూ.371.9 కోట్ల అభివృద్ధి పనులకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్, మేయర్లు, డిప్యూటీ మేయర్లతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
వరద ముప్పు రాకుండా..
భవిష్యత్తులో వరద ముప్పు రాకుండా మురుగునీటి కాల్వలు, వరద కాల్వల నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.858 కోట్లు మంజూరు చేశారు. మహేశ్వరం నియోజకవర్గానికి రూ.92.89 కోట్లు కేటాయించాం. ఇందులో బడంగ్‌పేట కార్పొరేషన్‌కు రూ.64 కోట్లు, మీర్‌పేటకు రూ.18.19 కోట్లు, జల్పల్లికి రూ.10.66 లక్షలు కేటాయించినం.
రహదారుల అభివృద్ధికి రూ.58.20 కోట్లు
రహదారుల అభివృద్ధి, విస్తరణకు రూ.58.20 కోట్లు కేటాయించాం. బడంగ్‌పేటకు రూ.16.60 కోట్లు, మీర్‌పేటకు రూ.12.50 కోట్లు, జల్పల్లి రూ.29 కోట్లు కేటాయించాం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రూ.13 కోట్లు కేటాయించాం. వారం రోజుల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.280 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నాం. మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికే రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాం.
సన్నబియ్యంతోనే భోజనం
ఇంట్లో సీఎం కేసీఆర్ మనమళ్లు ఏ బియ్యంతో భోజనం చేస్తున్నారో..అదే సన్నబియ్యంతో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్ విద్యార్థులకు భోజనం పెడుతున్నాం. తమది సంస్కారమున్న ప్రభుత్వం. ప్రతి విద్యార్థిపై ఏడాదికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఉన్నతవిద్య కోసం 8 ఏండ్లలో రూ.16 వేల కోట్లు ఖర్చు పెట్టినం. రూ.7289 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయబోతున్నాం. కేంద్రం తెలంగాణకు చేసింది గుండు సున్నా.
దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం మనది
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను వివిధ రాష్ర్టాల్లో పేర్లు మార్చి పెట్టుకున్నారు. రైతుబంధును 11 రాష్ర్టాల్లో వివిధ పేర్లతో పెట్టుకున్నారు. మిషన్ భగీరథను ప్రధాని మోదీ కాపీ చేసి ‘ఆర్గర్కో జల్’అని ప్రారంభించారు. పీఎం కిసాన్ సమ్మాన్ అని పెట్టుకున్నారు. దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం తెలంగాణ. ఎకానమీలో 4వ రాష్ట్రంగా తెలంగాణ ఉందని ఆర్బీఐ తెలిపింది.
అధికారులకు అభినందన
పాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నారని జలమండలి ఎండీ దానకిషోర్, రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణలను మంత్రి కేటీఆర్ అభినందించారు. సమావేశానికి బడంగ్‌పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అధ్యక్షత వహించగా.. మేయర్లు పారిజాత, దుర్గా దీప్లాల్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డిలను ఘనంగా సత్కరించారు.
కృష్ణా-గోదావరితో కుస్తీలు మాయం
సీఎం కేసీఆర్ ముందుచూపుతో కృష్ణా-గోదావరి జలాలను నగరానికి తీసుకొస్తున్నాం. గతంలో ఎండాకాలం వచ్చిందంటే బిందెలతో కుస్తీలు పట్టేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రతి ఇంటికీ పుష్కలమైన తాగునీరు వస్తున్నది. తాగునీటి కోసం మహేశ్వరం నియోజకవర్గానికి రూ.212 కోట్లు కేటాయించాం. ఇందులో బడంగ్‌పేట కార్పొరేషన్‌కు రూ.82 కోట్లు, మీర్‌పేట కార్పొరేషన్‌కు రూ.24 కోట్లు, తుక్కుగూడ మున్సిపల్‌కు రూ.29 కోట్లు, జల్పల్లికి రూ.72 కోట్లు కేటాయించాం. ఒక్క రోజులో మంచినీటి కోసం రూ.207 కోట్ల పనులకు శంకుస్థాపన చేయడం విశేషం.
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
తాగునీటి సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ రూ.1200 కోట్లు మంజూరు చేశారు. వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రూ.850 కోట్లు మంజూరు చేయగా, మహేశ్వరం నియోజకవర్గానికి రూ.100 కోట్లు కేటాయించారు. చెరువులను అనుసంధానిస్తూ నాలాలను అభివృద్ధి చేస్తున్నాం. రూ.23 కోట్లతో ట్రంక్‌లైన్ పనులు పూర్తిచేయడంతో చెరువుల్లోకి మురుగు చేరడం లేదు.
-సబితారెడ్డి, విద్యాశాఖ మంత్రి
కేంద్రం సహకరించడం లేదు
రాష్ర్టాభివృద్ధికి కేంద్రం చేయుతనివ్వడం లేదు. రాష్ర్టాలు లేకుండా కేంద్రం ఎక్కడ ఉంటుంది. రాష్ర్టాలు నిధులు ఇవ్వకపోతే కేంద్రానికి ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు.
-రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ
టీఆర్ఎస్ వచ్చిన తర్వాతే అభివృద్ధి
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. ప్రతి గడపకు పథకాలు చేరుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తా.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే