ధర్పల్లి, డిసెంబర్ 22 : మండలకేంద్రంలో నూతనంగా నిర్మించిన మున్నూరుకాపు కల్యాణ మండపాన్ని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్సీ వీజీగౌడ్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. అన్నివర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నామని, అభివృద్ధి చేసేవారినే ప్రజలు ఆదరించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ను ఒప్పించి మంచిప్ప రిజర్వాయర్ ద్వారా కాళేశ్వరం జలాలను పైపులైన్‌తో నియోజకవర్గంలోని పంటలకు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అన్ని సామాజికవర్గాలకు అండగా నిలుస్తూ, ఆయా సంఘాల అభివృద్ధికి పెద్దమొత్తంలో నిధులను అందించామని చెప్పా రు. అనంతరం ఎమ్మెల్సీ వీజీగౌడ్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంత గా అభివృద్ధి జరుగుతున్నదని అన్నారు. అన్నివర్గాల సంక్షే మం, అభివృద్ధికి తనవంతు చేయూతనందిస్తానని అన్నారు.
కుల సంఘాలకు నిధుల మంజూరు..
మండలంలోని ధర్పల్లితోపాటు పలు గ్రామాలకు చెందిన కులసంఘాల అభివృద్ధికి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి నిధుల మంజూరు పత్రాలను అందజేశారు. ధర్పల్లి రజక సంఘానికి రూ.5 లక్షలు, రేకులపల్లి వీడీసీ భవన నిర్మాణానికి రూ. 5 లక్షలు, గురడిరెడ్డి సంఘానికి రూ. 5 లక్షలు మంజూరు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, రైతుబంధు సమితి జిల్లాసభ్యుడు రాజ్‌పాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, మాజీ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, సర్పంచ్ పెద్దబాల్‌రాజ్, నాయకులు సుభాష్, కిశోర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, నరేందర్, సురేందర్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.