e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News వాస్తు... కొత్తగా కట్టిన ఇంటిగోడలకు పగుళ్లు వచ్చాయి. వాస్తు దోషం అంటున్నారు. నిజమేనా?

వాస్తు… కొత్తగా కట్టిన ఇంటిగోడలకు పగుళ్లు వచ్చాయి. వాస్తు దోషం అంటున్నారు. నిజమేనా?

-కె. ధనలక్ష్మి, చేవెళ్ల

ఇంటికి, ఇంట్లో వారికి ఏమైనా జరిగితే ‘వాస్తు దోషం’ అని అంటూ ఉంటారు. అది తప్పు. వాస్తు ఔన్నత్యం గురించి తెలిసిన వాళ్లు అలా మాట్లాడరు. గోడలకు నిలువుగా గానీ, అడ్డంగా గానీ పగుళ్లు వచ్చినప్పుడు అది కచ్చితంగా నిర్మాణ లోపమే. పునాది సమతులంగా లేకపోవడం వల్ల, బేస్‌మెంట్‌ మీద ప్లింత్‌ బీమ్‌ వేయకుండా కడితే నిలువు పగుళ్లు వస్తాయి. గోడలు కట్టేటప్పుడు ఒంపుతో గుండుదారం వాడకుండా, నైపుణ్యంలేని వాళ్లతో కట్టించడం వల్ల, క్యూరింగ్‌ సరిగ్గా లేకపోవడం వల్ల అడ్డం పగుళ్లు వస్తాయి. కాబట్టి నిర్మాణ లోపాలను వాస్తు దోషాలుగా పరిగణించ కూడదు. మరోమాట, సెంట్రింగ్‌ సరిగ్గా లేకపోతే కూలీల బరువుకే నిర్మాణం కూలిపోవచ్చు.

- Advertisement -

స్లాబును ఈశాన్యం వైపు ఒంపుచేసి వేసుకోవచ్చా?
-సి. బద్రి, కొత్తగూడెం

ఇది సరైన ఆలోచన కాదు. ‘ఈశాన్యం వైపు నీరు పోవాలి కదా’ అనే ఉద్దేశంతో స్లాబునే కొన్ని అంగుళాలు ఒంపు చేసి వేయడం నిర్మాణ పటిష్ఠతకు భంగం తెస్తుంది. సెంట్రింగ్‌ సమంగా బిగించి ఎత్తు ఒంపులు లేకుండా కట్టుకొని దానిమీద సూచించిన మందంతో (నాలుగున్నర లేదా ఐదున్నర అంగుళాలు) స్లాబ్‌ వేయాలి. స్లాబ్‌ కర్రలు (సెంట్రింగ్‌) తొలగించిన తరువాత, పైన మళ్లీ స్లాబును లాగడం అంటూ సరిచేస్తారు. అప్పుడు ఈశాన్యం దిశకు వాలుగా చేసుకోవచ్చు. తద్వారా వాడిన నీరు, వర్షం నీరు ఇంటి ఈశాన్యం వైపు వెళ్తాయి. పిరమిడ్‌ కప్పులు, ఇతరత్రా వాలు నిర్మాణాలు చేసినప్పుడు నీరు పారే విధానం వేరుగా ఉంటుంది. అంతేకానీ, సాధారణ స్లాబును ఇష్టం వచ్చినట్లు వేయకూడదు.

మాది పడమర ఇల్లు. డ్రాయింగ్‌ రూమ్‌ వాయవ్యంలో వస్తుంది. అది నైరుతి గది కంటే పెద్దగా ఉండొచ్చా?
-ఎం. శ్రీపతి, నిర్మల్‌

డ్రాయింగ్‌ రూమ్‌ను ఎప్పుడు కూడా అన్నిటికంటే పెద్దగా చేయటం మంచిది కాదు. లాంజ్‌లా ఆకర్షించేలా ఉండాలని పెద్ద హాలుగా చేయడం వల్ల గృహ విభజనకు విఘాతం వస్తుంది. ఇంటి నక్షలోనే గదుల విభజన వస్తుంది. దాని గురించి తంటాలు పడాల్సిన అవసరం ఉండదు. మీరు ముందుగా మధ్య హాలును విభజన చేయండి. అప్పుడు మీ ఇల్లు మూడు భాగాలుగా ‘ఆరు గదుల’ పథకంలా మారుతుంది. అప్పుడు మధ్యభాగాన్ని ఖాళీ పెట్టి దక్షిణం వదిలితే ఉత్తరం నిర్మాణ విభాగంలో చిన్నది అవుతుంది. అప్పుడు దక్షిణ నైరుతి గది తూర్పు గోడతో సమానంగా వాయవ్యం గది అవుతుంది. దాన్నే ఆర్చితో గానీ, ప్రత్యేక గదిగా కట్టిగానీ పశ్చిమ వాయవ్యం సింహద్వారంతో డ్రాయింగ్‌ రూమ్‌ కట్టుకోండి.

మూడు కోణాల (ట్రయాంగ్యులర్‌) స్థలంలో వాణిజ్య సముదాయం కట్టుకోవచ్చా?
– ఎం. సంపత్‌, మోర్తాడ్‌

ఒకప్పుడు త్రిభుజాకారం జోలికే వెళ్లేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు వంకర టింకర స్థలాల్ని కూడా వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీ త్రిభుజాకార స్థలానికి ఉత్తరం వీధి ఉంది కాబట్టి, నిర్మాణానికి కొంత అవకాశం ఉంది. దానిలో ఉత్తరం ప్రధాన అంచుగా భుజం తీసుకుని దానిని అనుసరించి ఒక చతురస్రం కానీ, దీర్ఘ చతురస్రం కానీ వచ్చేలా స్థలాన్ని ఎంచుకోండి. అది మార్క్‌ చేసుకొని మిగతా స్థలం.. ఎన్ని ముక్కలుగా వచ్చినా సరే, దానిని వదిలివేయండి. అందులో మళ్లీ ఏదో కడదాం, దేనికైనా వాడుకుందాం అనుకోకుండా.. ఇతరులకు ఇవ్వండి. ఎంచుకున్న శాస్త్రీయ స్థలంలో మీరు వాణిజ్య సముదాయమే కాదు, ఇంటిని కూడా కట్టుకోవచ్చు.

బేస్‌మెంట్‌ (భరంతి) నింపటానికి ఏ మట్టి మంచిది?

  • రాము, భువనగిరి

మంచి మట్టితో… కుదిరితే ఎర్రమట్టి, మొరంతో ఇంటి భరంతి నింపాలి. బంకమన్ను, ఎముకలు, వెంట్రుకలు ఉన్న మట్టితో, చెరువుమట్టితో నింపవద్దు. భరంతిని ఒకేసారి నింపేసి పని అయిపోయిందని అనిపించుకోవద్దు. సగం ఒకరోజు, మిగతా సగం ఒకరోజు నింపాలి. దానిని చదునుగా చేసి, దిమ్మిసతో కొట్టాలి. ఎగుడు దిగుడు లేకుండా చేసుకోవాలి. ఆ మట్టికి పైపుతో నీళ్లు పట్టించాలి. గడ్డపారతో వదులు చేస్తూ, నీళ్లు పట్టిస్తూ.. అది కుంగిన తర్వాత, ఆ మట్టి ఆరిపోయాక మళ్లీ మట్టి పోయాలి. ఇంజినీరు సూచనలతో భరంతి నింపడం పూర్తిచేయాలి. ఇండ్లు కూలగొట్టిన మట్టి, రాళ్లు, పెళ్లలు, ఇటుకలతో భరంతి నింపకూడదు.

సుద్దాల సుధాకర్‌ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement