మరికల్, ఏప్రిల్ 8 : లంచం తీసుకొంటూ నారాయణపేట జిల్లా మరికల్ డిప్యూటీ తాసిల్దార్, సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ ఫయాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్ మండలం రాకొండకు చెందిన మదన్మోహన్రావు పేరిట గ్రామ శివారులో 9.21 ఎకరాల భూమి ఉన్నది. దీన్ని రెవెన్యూ అధికారులు సదరు యజమానికి తెలియకుండానే వేరే వ్యక్తుల పేరిట రిజిస్టర్ చేశారు. విషయం తెలుసుకొన్న సదరు యజమాని మదన్మోహన్రావు కూతురు సంధ్యారాణి ఐదేండ్ల కిందట కోర్టులో కేసు వేశారు. గత ఏడాది మే 21న ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ భూమిపై ఉన్న పీవోటీని తొలగించాలని కోరారు. నాటి తాసిల్దార్ శ్రీధర్ రూ.10 లక్షలు డిమాండ్ చేశారని గత ఏడాది నవంబర్ 22న సీనియర్ అసిస్టెంట్ తాహేర్ సదరు మహిళకు తెలిపాడు. అంత మొత్తం ఇచ్చుకోలేనని చెప్పడంతో ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత జనవరిలో సదరు తాసిల్దార్ వేరే కేసులో ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా సీనియర్ అసిస్టెంట్ తాహేర్ గత నెల సదరు మహిళకు ఫోన్ చేసి.. రూ.4 లక్షలిస్తే పని పూర్తిచేస్తానని చెప్పాడు. దీనికి ఆమె రూ.3.50 లక్షలు ఇస్తానన్నారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వద్ద డిప్యూటీ తాసిల్దార్ జగన్, సీనియర్ అసిస్టెంట్ తహేర్ అలీ రూ.3.50 లక్షల లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. కేసు నమోదు చేసి ఇద్దరిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.