సికింద్రాబాద్, డిసెంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి , షాదీముబారక్ పథకాలు పేద తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నదని పద్మారావుగౌడ్ కొనియాడారు.
సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని మంగళవారం బౌద్ధనగర్ డివిజన్లో వారాసిగూడ, ఈశ్వరీబాయి నగర్, పార్శిగుట్ట, సంజీవపురం, మహ్మద్‌గూడ, అంబర్నగర్తో పాటు పలు ప్రాంతాలకు చెందిన 60 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పాటు ఐదుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక కార్పొరేటర్ కంది శైలజతో కలిసి సుమారు రూ.63లక్షల విలువచేసే చెక్కులను లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కంది నారాయణ, కిశోర్‌గౌడ్, కిరణ్‌కుమార్ గౌడ్, రామేశ్వర్‌తో పాటు పలు విభాగాలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.