హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొంది, అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన ఫిరాయింపుదారులు కౌంటర్లు దాఖలు చేశారని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ స్పందిస్తూ.. కౌంటర్లు దాఖలు చేసేందుకు ఇప్పటికే అనేక వాయిదాలు ఇచ్చామని, అయినా కౌంటర్లు దాఖలు చేయరా? అని ప్రశ్నించింది. కౌంటర్ల దాఖలు ఇదే చిట్టచివరి అవకాశమని తేల్చి చెప్పింది. ఇప్పటివరకు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయని ఎమ్మెల్యేలకు చివరి అవకాశం ఇస్తున్నామని స్పష్టంచేసింది.
రెండు వారాల్లోగా కౌంటర్లు సమర్పించాలని నోటీసులు జారీచేసింది. ఆ తరువాత వారం రోజుల్లోగా పిటిషనర్లు రిైప్లె కౌంటర్లు దాఖలు చేయాలని సూచించింది. మరో వారం రోజుల్లోగా ఇరుపక్షాలు రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టీ ప్రకాశ్‌గౌడ్, ఏ గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్‌రెడ్డిపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో సవాలు చేశారు.
స్పీకర్ ఇచ్చిన తీర్పులను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీ జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, కే సంజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీహెచ్ ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డితోపాటు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏ మహేశ్వర్‌రెడ్డి మొత్తం పది పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని సీజే బెంచ్ విచారణ చేపట్టగానే గండ్ర మోహన్‌రావు కల్పించుకొని, ప్రతివాదుల్లో దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా ఇప్పటికే కౌంటర్లు దాఖలు చేశారని చెప్పారు.
ఈ ఇద్దరి తరఫు న్యాయవాదులు స్పందిస్తూ, మరో వారం రోజులు గడువు కావాలని కోరారు. రెండు వారాల్లోగా కౌంటర్లు దాఖలైన అనంతరం పిటిషనర్లు మరో వారం రోజుల్లో రిైప్లె కౌంటర్లు దాఖలు చేయాలని, అలాగే అన్ని పక్షాలు మూడు వారాల్లోగా తమ రాతపూర్వక వాదనలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది.